అందుబాటులోకి కాళేశ్వరం జలాలు, రికార్డ్ టైమ్ లో మరమ్మతులు..
కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ ఏడాది యాసంగి పంటల అవసరాలకు 25 టీఎంసీల వరకు నీటిని తరలించే అవకాశం ఉంది.
ఈ ఏడాది జులై లో గోదావరికి వరద పోటెత్తడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని పంప్ హౌస్ లు నీటమునిగిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం పనైపోయిందని, ఇక పునరుద్ధరణ కుదరదని, మోటార్లు చెడిపోయాయని కొంతమంది నోటికొచ్చినట్టు విమర్శలు చేశారు. మునిగే ప్రాంతంలో పంప్ హౌస్ లు ఎలా కట్టారంటూ లాజిక్ లేకుండా మాట్లాడారు మరికొందరు. కానీ అప్పుడే ప్రభుత్వం, నిర్మాణ సంస్థ గట్టిగా సమాధానమిచ్చాయి. రికార్డ్ టైమ్ లో మరమ్మతులు పూర్తి చేసి ఇప్పుడు చేతలతో జవాబిచ్చాయి. ప్రస్తుతం కాళేశ్వరం పంప్ హౌస్ ల నుంచి నీరు పరుగులు పెడుతోంది.
కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ ఏడాది యాసంగి పంటల అవసరాలకు 25 టీఎంసీల వరకు నీటిని తరలించే అవకాశం ఉందని కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. పంపుల పునరుద్ధరణ పనులను ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతోపాటు, ఎస్ఈ కరుణాకర్, ఈఈ తిరుపతిరావు, డీఈ సూర్యప్రకాష్, మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిపుణులు పర్యవేక్షించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మండలం లక్ష్మి పంప్ హౌస్ వద్ద ఆదివారం రెండు పంపుల్ని ఆపరేట్ చేసి నీటిని ఎత్తిపోశారు. మొదటగా రక్షణ గోడను పునరుద్ధరించిన అధికారులు నీటిని తొలగించి 20 రోజుల క్రితం మరమ్మతులు పూర్తి చేశారు. శనివారం 1, 2 పంపులను సిద్ధం చేసి ప్రయోగాత్మకంగా నడిపారు. ఆదివారం ఆ పంపుల ద్వారా నీటిని తోడేశారు. ఈ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీకి చేరుతుంది.
లక్ష్మి పంప్ హౌస్ లో ఉన్న మొత్తం 17 మోటర్లలో ఎనిమిది సిద్ధమయ్యాయి. సరస్వతి పంప్ హౌస్ లో ఉన్న 12 మోటర్లలో నాలుగు సిద్ధం చేసి నీటిని ఎత్తిపోశారు. లక్ష్మి, సరస్వతి పంప్ హౌస్ లు పూర్తి స్థాయిలో సిద్ధమయితే, మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు నీటిని తరలించే అవకాశం ఉంది.