తెలంగాణ భేష్.. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కితాబు
జులై నెలలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా తెలంగాణలో 2617మంది చిన్నారులను రక్షించారు. వారిని పనిలో పెట్టుకుని హింసిస్తున్న 436మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 400కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదు కావడం విశేషం.
తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, వాటిని అమలు చేయడంలో అధికార యంత్రాంగం చూపించే చొరవ చాలాసార్లు దేశంలోనే మెరుగైన ఫలితాలు సాధించి చూపెడుతోంది. ఆపరేషన్ ముస్కాన్ ఇందులో ఒకటి. బాలకార్మికులకు వెట్టి చాకిరి నుంచి విడుదల కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపడుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆపరేషన్ ముస్కాన్ అమలులో ఉంది. అయితే అక్కడక్కడా తూతూమంత్రంగా దీన్ని అమలు చేస్తుంటారు. పగడ్బందీగా అమలు చేస్తే ఫలితాలు మరో లెవల్ లో ఉంటాయని నిరూపించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ ప్రయత్నాన్ని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి కూడా అభినందించడం విశేషం.
Congratulations dear @TelanganaCMO & @TelanganaCOPs for setting an example by rescuing 2617 children through Operation Muskaan in the month of July alone. More than 400 FIRs were registered while 436 accused have been arrested.@TelanganaDGP @Shikhagoel_IPS
— Kailash Satyarthi (@k_satyarthi) August 3, 2023
నెలరోజుల్లో 2617 మంది చిన్నారులకు విడుదల..
జులై నెలలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా తెలంగాణలో 2617మంది చిన్నారులను రక్షించారు. వారిని పనిలో పెట్టుకుని హింసిస్తున్న 436మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 400కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదు కావడం విశేషం. ఆయా చిన్నారులకు వెట్టి చాకిరి నుంచి శాశ్వత విముక్తి ప్రసాదించారు పోలీసులు. నెలరోజుల వ్యవధిలో 2617మంది చిన్నారులను కాపాడటం మామూలు విషయం కాదు. అందుకే నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ప్రత్యేకంగా ట్వీట్ వేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పోలీసుల పనితీరుని మెచ్చుకున్నారు.
కైలాష్ సత్యార్థి ట్వీట్ కి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ ఆదర్శంగా నిలుస్తోందని, ఆపరేషన్ ముస్కాన్ లో కూడా దేశానికే తెలంగాణ ఆదర్శం అని అంటున్నారు నెటిజన్లు. తెలంగాణ పోలీసుల కృషిని అభినందిస్తున్నారు.