Telugu Global
Telangana

కడియం అల్లుడు నజీరుద్దీన్.. బీజేపీ టార్గెట్ అతడే

గుంటూరు వాస్తవ్యురాలైన కావ్య నజీరుద్దీన్ కి వరంగల్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని లాజిక్ తీశారు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్.

కడియం అల్లుడు నజీరుద్దీన్.. బీజేపీ టార్గెట్ అతడే
X

ప్రత్యర్థి ఎవరైనా బీజేపీ టార్గెట్ ఒక్కటే.. మతం పేరు చెప్పి ఓట్లు అడగటం. ప్రస్తుతం వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. గుంటూరుకి చెందిన మహమ్మద్ నజీరుద్దీన్ అనే వ్యక్తిని కావ్య పెళ్లి చేసున్నారని, ఆమె కావ్య నజీరుద్దీన్ అని చెబుతున్నారు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్. గుంటూరు వాస్తవ్యురాలైన కావ్య నజీరుద్దీన్ కి వరంగల్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని లాజిక్ తీశారాయన.

కడియం వర్సెస్ ఆరూరి..

ప్రత్యర్థులు వాళ్లే.. కానీ పార్టీలు మారారు. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ కొన్ని నెలల ముందు వరకు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. వరంగల్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి పసునూరి దయాకర్ కు టికెట్ లేదని తేలిపోవడంతో ఆరూరి రమేష్ కూడా రేసులో నిలబడ్డారు. అయితే కడియం శ్రీహరి ఆయనకు అడ్డుపడ్డారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఖాయం అవుతుందనుకున్న సమయంలో ఆరూరి రమేష్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ వరంగల్ టికెట్ లభించింది. కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. రోజుల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. కావ్యతో సహా కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. కాంగ్రెస్ కూడా కావ్యకే వరంగల్ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆరూరి రమేష్, కావ్య ప్రత్యర్థులయ్యారు.

బీఆర్ఎస్ టికెట్ తనకు కాకుండా చేసిన కావ్య, పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిగా తనపై పోటీ చేయడాన్ని ఆరూరి రమేష్ జీర్ణించుకోలేకపోతున్నారు. కడియం కుటుంబం లేకపోతే రమేష్ బీఆర్ఎస్ లోనే ఉండేవారు, టికెట్ రేసులో కూడా నిలిచేవారు. తనకు టికెట్ లేకుండా చేయడంతోపాటు, కావ్య కూడా బీఆర్ఎస్ టికెట్ ని కాదనుకోవడంతో ఆరూరి మరింతగా రగిలిపోతున్నారు. కొత్తగా కావ్య నజీరుద్దీన్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. కడియం శ్రీహరి దళితులను అణచివేశారని, ఆయన కుట్రలకు తాను కూడా బలయ్యాయని ఆరోపించారు. వర్థన్నపేట ఎమ్మెల్యేగా తాను మూడోసారి గెలిస్తే మంత్రి రేసులో ఉండేవాడినని, కానీ కడియం శ్రీహరి కుట్రలకు తాను బలయ్యానని చెప్పారు ఆరూరి రమేష్. బీఆర్‌ఎస్‌లో ఉండి ఎస్సీ నేతలను బయటకు పంపించే వరకు కడియం కుతంత్రాలు చేశారని విమర్శించారు. ఏ పార్టీలో ఉన్నా కూడా కడియం శ్రీహరి దళితులను ఎదగకుండా అణచివేశారని ఆరోపించారు. గుంటూరు కోడలు కావ్య నజీరుద్దీన్‌ కావాలో.. వరంగల్‌ బిడ్డ ఆరూరి రమేష్ కావాలో స్థానికులు నిర్ణయించుకోవాలని సూచించారు.

First Published:  12 April 2024 7:53 AM IST
Next Story