మీసం తిప్పి, తొడగొట్టి.. ఘన్ పూర్ రాజకీయం గరం గరం
కడియంకి సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాజయ్య. 'రా ఉప ఎన్నికల్లో నువ్వా నేనా చూసుకుందాం' అని సవాల్ విసిరారు.
కొన్ని నెలల క్రితం స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి విజయం కోసం సిన్సియర్ గా ప్రచారం చేశారు తాటికొండ రాజయ్య. అంతలోనే సీన్ రివర్స్ అయింది. కడియం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. కడియంతో పొసగక బయటకు వెళ్లిపోదామనుకున్న రాజయ్య.. ఇప్పుడు కేసీఆర్ కి మరింత దగ్గరయ్యారు. అసలు పోరు ఇప్పుడు మొదలైంది. ఘన్ పూర్ వేదికగా రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లు హాట్ హాట్ గా మారిపోయాయి. దమ్ముంటే రా చూస్కుందామంటూ రాజయ్య.. కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. మీసం మెలేశారు, తొడగొట్టారు.
కూతురుతో సహా రాజయ్య కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడంతో ఓ దశలో వరంగల్ బీఆర్ఎస్ టికెట్ రాజయ్యకు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయనకు గెలుపు బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్. అభ్యర్థి సుధీర్ కుమార్ ని గెలిపించుకుని తీసుకు రావాలన్నారు. ఆ బాధ్యతను తీసుకున్న రాజయ్య రంగంలోకి దిగారు. కడియంకు చుక్కలు చూపెడుతున్నారు. ఈరోజు వరంగల్ పార్లమెంట్ స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న ఆయన.. కడియంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
శ్రీహరికి సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాజయ్య. 'రా ఉప ఎన్నికల్లో నువ్వా నేనా చూసుకుందాం' అని సవాల్ విసిరారు. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యనే అని స్పష్టం చేశారు. మన ఇద్దరి మధ్య పోరాటం కోసం ఒక్క తెలంగాణనే కాదు దేశం మొత్తం ఎదురుచూస్తోందని రాజయ్య తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రావాల్సిన టికెట్ ని కడియం కొట్టేశారనే కోపం రాజయ్యలో ఉంది. అలా టికెట్ తీసుకుని కూడా ఆయన బీఆర్ఎస్ లో నిలవలేదు. దీంతో పార్టీ కూడా నష్టపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థికి అండగా నిలబడ్డారు రాజయ్య, తన ప్రత్యర్థిపై బదులు తీర్చుకోడానికి రెడీ అవుతున్నారు. కడియం కుమార్తెను ఓడించి తీరుతామంటున్నారు.