రాజయ్యపై కడియం ఆసక్తికర వ్యాఖ్యలు
తాజాగా కడియం శ్రీహరి, రాజయ్యపై స్పందించడం విశేషం. స్టేషన్ ఘన్ పూర్ లో మీడియాతో మాట్లాడిన కడియం... రాజయ్య వ్యవహారంలో తన లాజిక్ చెప్పారు.
స్టేషన్ ఘన్ పూర్ రాజకీయం రోజు రోజుకీ రసవత్తరంగా మారుతోంది. టికెట్ సాధించుకున్న కడియం శ్రీహరి కాస్త సైలెంట్ గా ఉండగా, టికెట్ దక్కని రాజయ్య మాత్రం రోజుకో స్టేట్ మెంట్ ఇస్తూ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆమధ్య కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో రాజయ్య భేటీ మరింత సంచలనంగా మారింది. తాజాగా కడియం శ్రీహరి, రాజయ్యపై స్పందించడం విశేషం. స్టేషన్ ఘన్ పూర్ లో మీడియాతో మాట్లాడిన కడియం... రాజయ్య వ్యవహారంలో తన లాజిక్ చెప్పారు.
రాజయ్య నాకు సహకరిస్తారు..
జమిలి కావొచ్చు, ఇంకేదైనా కారణం కావొచ్చు.. చివరి నిమిషంలో ఎలాగైనా టికెట్ తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య. కానీ తానే బరిలో నిలబడతానని, రాజయ్యే తన గెలుపుకోసం సహకరిస్తారని ధీమాగా చెబుతున్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. 2014, 2018 ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ ఇస్తే.. ఆయన గెలుపు కోసం తాను కృషి చేశానని చెప్పారు కడియం. ఇప్పుడు తనకు టికెట్ ఇచ్చారు కాబట్టి రాజయ్య కచ్చితంగా సహకరిస్తారని లాజిక్ చెప్పారు. బీఆర్ఎస్ ని గెలిపించేందుకు రాజయ్యతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రుల సహకారం తీసుకుంటానని తెలిపారు కడియం.
అది కప్పల తక్కెడ..
ఎన్నికల టైమ్ లో పార్టీలో చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయని, సమస్యలుంటే అవి సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. ఏ సమస్య ఉన్నా సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా ఘన్ పూర్ లో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. తెలంగాణలో బీజేపీ కేవలం 3 సీట్లకే పరిమితమైందని, కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు కడియం.