కడియం శ్రీహరి హాట్ కామెంట్స్..
తాను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి భయం ఎందుకని ప్రశ్నించారు కడియం. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలోనే ఎందుకన్నారు.
బీఆర్ఎస్ ని వీడేందుకు సిద్ధమైన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈరోజు తన అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని చెప్పారు. అదే సమయంలో తనకు తాను ఆ పార్టీలోకి వెళ్లడం లేదని, వారే వచ్చి తనను ఆహ్వానించారని తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు కడియం.
స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశం
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024
పార్టీ మారుదామా వద్దా అని కార్యకర్తలను అడిగిన కడియం. బీఆర్ఎస్ పార్టీలోనే వుంటే కార్యకర్తలకు, నియోజకవర్గ అభివృద్ధి చేసుకోలేమని కడియంకు చెప్పిన కార్యకర్తలు.
నేను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి భయం ఎందుకు. పసునూరి… pic.twitter.com/cpch9I5ebT
వరంగల్ సీటు కావ్యకే..
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ టికెట్ కేటాయించినా, సాకులు చెప్పి వెనక్కి తగ్గిన కడియం శ్రీహరి కుమార్తె కావ్య.. ఇప్పుడు అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇన్నాళ్లూ కడియం శ్రీహరికి కాంగ్రెస్ వరంగల్ సీటు ఇస్తుందని అనుకున్నా.. ఇప్పుడాయన సీటు విషయంలో క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తెకు కాంగ్రెస్ ఎంపీ సీటు ఆఫర్ చేసిందన్నారు.
కడియం కవరింగ్ గేమ్..
మొత్తానికి పార్టీ మారాలని ఫిక్స్ అయిన కడియం శ్రీహరి దాన్ని తన అభిమానుల అభీష్టంగా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ లోనే ఉంటే నియోజకవర్గ అభివృద్ధి చేసుకోలేమని కార్యకర్తల తనకు చెప్పారని అంటున్నారు కడియం. వారి కోసమే తాను పార్టీ మారుతున్నట్టు కవర్ చేసుకున్నారు.
అభ్యంతరం ఏంటి..?
తాను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి భయం ఎందుకని ప్రశ్నించారు కడియం. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలోనే ఎందుకన్నారు. పరోక్షంగా తాను వారికంటే బలమైన నేతను అని చెప్పుకునే ప్రయత్నం చేశారు కడియం.