ఇవాళ కాంగ్రెస్‌లోకి కడియం.. వరంగల్ ఎంపీగా పోటీ
వివిధ కారణాల సాకు చూపి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం కేసీఆర్‌కు లేఖ రాశారు కావ్య. కాంగ్రెస్‌లో చేరాలని ఒప్పందం కుదరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఇవాళ కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. తన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి లేదా కావ్య బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. గతంలోనూ వరంగల్ ఎంపీగా పని చేశారు కడియం శ్రీహరి. తెలంగాణలోని 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 4 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. అందులో వరంగల్ స్థానం ఒకటి.
వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్యను కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే వివిధ కారణాల సాకు చూపి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం కేసీఆర్‌కు లేఖ రాశారు కావ్య. కాంగ్రెస్‌లో చేరాలని ఒప్పందం కుదరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ గూటికి చేరారు. దీంతో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన వరంగల్‌లో బీఆర్ఎస్‌కు అభ్యర్థి కరువయ్యారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి టీఎస్‌పీఎస్సీ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మన్నె క్రిశాంక్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. గులాబీ బాస్ ఎవరినీ ఫైనల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.