కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్ధం
కడపలోని పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 16న ప్రారంభమయ్యే ఈ ఉరుసు ఉత్సవాలు దాదాపు వారం రోజుల పాటు జరుగుతాయి.
కడపలోని పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలకు సర్వం సిద్దమైంది. రేపటి నుంచి ఈనెల 21వరకు జరిగే ధాన ఉరుసు ఉత్సవాలకు దర్గా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే విద్యుద్దీప శోభతో ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు సూఫీ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. భక్తులు దర్గాకు ఆధ్యాత్మిక శక్తులున్నాయని నమ్ముతారు. ఇక్కడ ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కడప పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో రేపు కడపలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా అధికారులు.
పెద్ద దర్గాను ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైన స్థలం, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడికీ చేరుకునే భక్తులు సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. పొలిటికల్ లీడర్లు, సినిమా స్టార్లు, క్రీడాకారులు అన్ని రంగాలకు చెందిన వారు దర్గాను సందర్శిస్తారు. మెగా హీరో రాం చరణ్ కూడా ఉత్సవాల్లో పాల్గోన్నారు.ఈ దర్గాకు సంబంధించిన ప్రథమ సూఫీ హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మహమ్మద్ చిష్ఠివుల్‌ఖాద్రి కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి 16వ శతాబ్దంలో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. సూఫీ తత్వాలతో ప్రజల్లో దైవ చింతనను పెంచిన ఈయనకు నాటి కడప నవాబులు ప్రియ శిష్యులుగా ఉండేవారు. ఆయన వారసునిగా ప్రస్తుతం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ 11వ పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. దర్గాపై అపార విశ్వాసం గల భక్తులు మన దేశంతోపాటు పాకిస్తాన్, గల్ఫ్ దేశాలలో కూడా ఉన్నారు