Telugu Global
Telangana

కేఏపాల్ లేని లోటు తీరుస్తున్న ఆర్జీ పాల్

రాజగో'పాల్' అనే పేరే కాదు, ఆయన మాట తీరు కూడా ఇటీవల కేఏపాల్ ని గుర్తు తెస్తోందని వెటకారం చేస్తున్నారు ప్రత్యర్థులు.

కేఏపాల్ లేని లోటు తీరుస్తున్న ఆర్జీ పాల్
X

రాజగోపాల్ అలియాస్ ఆర్జీపాల్ అంటూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు బీజేపీ భువనగిరి లోక్ సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ రాజకీయాల్లో కేఏపాల్ లేని లోటుని, ఆర్జీపాల్ తీరుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కామెడీ పంచుతున్నాయి తప్ప కాంగ్రెస్ కి ఓట్లు తీసుకు రాలేవని స్పష్టం చేశారు.

అన్నదమ్ముల పని అదే..

తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. లోక్ సభ ఎన్నికల తర్వాత తనకు హోం మంత్రి పదవి ఖాయం అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. అదే నిజమైతే.. ఆయన సోదరుడు వెంకట్ రెడ్డికి షాక్ తప్పదేమోననే అనుమానాలు బలపడుతున్నాయి. వెంకట్ రెడ్డికి పదవి తీసేసి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారేమోననే ప్రచారం జరుగుతోంది. ఈ దశలో వీరిద్దరూ రేవంత్ రెడ్డిని కాకా పడుతున్నారంటూ కథనాలు వినపడుతున్నాయి.

నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కొన్నాళ్ల క్రితం వరకు రేవంత్‌రెడ్డిని తీవ్ర దుర్భాషలాడారని, ఇప్పుడు ఆయన పంచన చేరి పొగుడుతున్నారని కోమటి రెడ్డి బ్రదర్స్ ని విమర్శించారు బూర నర్సయ్య గౌడ్. మంత్రి పదవిలో కొనసాగాలని ఒకరు, హోంమంత్రి పదవి కావాలని ఇంకొకరు రేవంత్ తో అంటకాగుతున్నారని ఆరోపించారు. నల్లగొండ ప్రజల్ని, రైతుల్ని వారు పట్టించుకోవడం లేదన్నారు. 4 నెలల కాంగ్రెస్‌ పాలన పూర్తిగా విఫలమైందని అన్నారాయన.

ఆర్జీపాల్ అంటూ బూర నర్సయ్య గౌడ్ వెటకారం చేస్తున్నా.. ఇటీవల కాలంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కేఏపాల్ ని గుర్తుకు తెస్తున్నాయి. నాకు కావాల్సింది అడిగి తీసుకోను, లాక్కుంటానంటూ ఇటీవల స్టేజ్ పైనే చిత్ర విచిత్రమైన హావభావాలతో నవ్వించారు రాజగోపాల్ రెడ్డి. పైగా తనకు హోం మంత్రి పదవి మాత్రమే కావాలంటున్నారు. ఆ పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలందర్నీ జైలుకి పంపిస్తానంటూ సవాళ్లు విసురుతున్నారు. రాజగో'పాల్' అనే పేరే కాదు, ఆయన మాట తీరు కూడా ఇటీవల కేఏపాల్ ని గుర్తు తెస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

First Published:  19 April 2024 10:00 AM IST
Next Story