Telugu Global
Telangana

దీక్షకు దిగితేగానీ సింబల్ ఇవ్వరా..? ఈసీపై కేఏ పాల్ ఫైర్

తెలంగాణలో నామినేషన్లు అందజేయడానికి చివరి రోజు రేపే అని చెబుతున్నప్పటికీ సింబల్ కేటాయించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు.

దీక్షకు దిగితేగానీ సింబల్ ఇవ్వరా..? ఈసీపై కేఏ పాల్ ఫైర్
X

తన పార్టీకి గుర్తు కేటాయించకుండా ఎన్నికల సంఘం అధికారులు వేధిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన కేఏ పాల్.. తన పార్టీకి సింబల్ కేటాయించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ అడిగిన అన్ని ధ్రువపత్రాలను గత సెప్టెంబర్ నెల‌లోనే అందజేశామని, అయినా తన పార్టీకి సింబల్ కేటాయించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని చెప్పారు.

ప్రజాశాంతి పార్టీ యాక్టివ్ గా ఉన్నప్పటికీ.. యాక్టివ్ గా లేదని అధికారులు చెబుతున్నారని.. ఇది సమంజసం కాదన్నారు. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నారో అర్థం కావడం లేదని పాల్ మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కూడా ఈసీ సింబల్ కేటాయించిందని, తన పార్టీకి మాత్రం కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో నామినేషన్లు అందజేయడానికి చివరి రోజు రేపే అని చెబుతున్నప్పటికీ సింబల్ కేటాయించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. అధికారులు తనకే ఎందుకింత నరకం చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సింబల్ కోసం నిరాహారదీక్ష చేపడితే కానీ ఇవ్వరా..? అని కేఏ పాల్ ప్రశ్నించారు.

తమ పార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్తే మీ పార్టీ సింబల్ ఏంటీ..? అని అడుగుతున్నారని చెప్పారు. నెలలు గడుస్తున్నా ప్రజాశాంతి పార్టీకి ఎందుకు గుర్తు కేటాయించడం లేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తన పార్టీకి సింబల్ కేటాయించడంతోపాటు నామినేషన్లు వేయడానికి మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. చట్టాలు మారాలంటే తనలాంటి వాడు ఎంపీ కావాలని.. తన పోరాటం ద్వారానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేశారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

First Published:  9 Nov 2023 6:02 PM IST
Next Story