Telugu Global
Telangana

బేరసారాల వెనక కిషన్ రెడ్డి, రఘునందన్..!

ఫామ్ హౌస్ బేరసారాల వెనక కిషన్‌ రెడ్డి, రఘునందన్‌ రావు మధ్యవర్తులుగా వ్యవహరించారని ఆరోపించారు కేఏ పాల్. వారిద్దరే ఈ డీల్ సెట్ చేశారని, చివరి నిమిషంలో ఈ డీల్ గురించి పోలీసులకు తెలిసిపోయిందని అన్నారు.

బేరసారాల వెనక కిషన్ రెడ్డి, రఘునందన్..!
X

తెలంగాణ‌లో మునుగోడు ఉప ఎన్నిక సంద‌ర్భంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో బీజేపీ బేర‌సారాల‌కు దిగింద‌నే ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయం వేడెక్కింది. ధ‌న‌బ‌లంతో గెల‌వాల‌నుకుంటున్న బీజేపీ త‌మ‌కు కోట్లాది రూపాయ‌లు ఇవ్వ‌జూపింద‌ని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరెవరూ బీజేపీ నేతలు కాదు, కేవలం ఆ ఆపరేషన్లో బలిపశువులు మాత్రమే. మరి దీని వెనక ఉన్న పెద్ద తలకాయలు ఎవరివి..? ఎవరు చెబితే వీరు ఇలా బేరసారాలకు దిగారు, అడ్వాన్స్ లతో ఫామ్ హౌస్ లో వాలిపోయారు..?

ఫామ్ హౌస్ బేరసారాలు బయటపడ్డాక బీజేపీ వైపే అందరూ వేలెత్తి చూపించారు. అయితే మునుగోడు బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ నేరుగా పేర్లు బయటపెట్టేశారు. ఈ వ్య‌వ‌హారం లో కిషన్‌ రెడ్డి, రఘునందన్‌ రావు మధ్యవర్తులుగా వ్యవహరించారని ఆరోపించారు కేఏ పాల్. పోలీస్ కేసు పెట్టిన పైలట్ రోహిత్ రెడ్డి కూడా పేర్లు చెప్పలేకపోయారు. ఇప్పుడు కేఏ పాల్ మాత్రం కిషన్ రెడ్డి, రఘునందన్ రావు ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులంటూ ఓ వీడియో విడుదల చేసి కలకలం రేపారు. తెలంగాణలో కూడా మహారాష్ట్ర తరహా పరిస్థితి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పాల్ వ్యాఖ్యలను పోలీసులు సీరియస్ గా తీసుకుంటే, ఆయన్ను కూడా విచారణకు పిలిపించే అవకాశముంది. రఘునందన్ రావు, కిషన్ రెడ్డి గురించి పాల్ ని ఆరా తీసే అవకాశం కూడా ఉంది.

ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇచ్చి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందని కేఏ పాల్ అన్నారు. అడ్వాన్స్ 15 కోట్ల రూపాయలను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోడవమే దీనికి నిదర్శనం అని చెప్పారు. మునుగోడు ఓటర్లకు కూడా వేల కోట్ల రూపాయలు పంచేందుకు రాజ‌కీయ పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయని చెప్పారు పాల్. డబ్బులిచ్చేవారికి అమ్ముడు పోవద్దని, అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న తనకు ఓటు వేయాలంటూ ఆ వీడియోలో ఓటర్లను అభ్యర్థించారు పాల్.

First Published:  27 Oct 2022 2:25 PM IST
Next Story