Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ కోర్కె అలా నెరవేరింది -కేఏ పాల్
తన శాంతి సందేశాలను సినిమా రూపంలో తెస్తానని కృష్ణ తనకు చెప్పేవారని, ఆ తర్వాత ఆయన శాంత సందేశం సినిమా చేశారని గుర్తు చేశారు కేఏ పాల్.
సూపర్ స్టార్ కృష్ణ పార్థి దేహాన్ని కడసారి చూసేందుకు, ఆయనకు నివాళులర్పించేందుకు చాలామంది ప్రముఖులు తరలి వస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో హడావిడి చేసిన కేఏ పాల్ కూడా కృష్ణ పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థన చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్, కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
శాంతి సందేశం సినిమా చేశారు..
కృష్ణతో తనకు 26ఏళ్లుగా అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు కేఏపాల్. తన శాంతి సభలకు ఆయన వచ్చేవారని, ఆ తర్వాత చారిటీ సిటీకి కూడా వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. చారిటీ సిటీకి వచ్చినప్పుడు పిల్లలతో కలసి ఆడుకునేవారని చెప్పారు. తన శాంతి సందేశాలను సినిమా రూపంలో తెస్తానని కృష్ణ తనకు చెప్పేవారని, ఆ తర్వాత ఆయన శాంతి సందేశం సినిమా చేశారని అన్నారు పాల్. శాంతిని కోరుకునే నటులలో కృష్ణ గొప్పవారని చెప్పారు.
సాయంలో మిన్న కృష్ణ..
సూపర్ స్టార్ కృష్ణ. అభిమానులను, సినీ ఇండస్ట్రీలో చాలామందిని ఆపదల్లో ఆదుకున్నారని అంటుంటారు. వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు ఆర్థిక సాయం చేసేవారని అభిమానులు గుర్తు చేస్తుంటారు. సహాయ కార్యక్రమాల విషయంలో కృష్ణ ఎప్పుడూ ముందుంటారని చెబుతున్నారు కేఏపాల్. చారిటీ అంటే ఆయనకు చాలా ఇష్టమని, అయన తర్వాత ఆయన పిల్లలు, వారసులు ఆ చారిటీ కార్యక్రమాలను కొనసాగిస్తారని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు పాల్. కృష్ణ భౌతికంగా చనిపోయినట్టు అనిపించడంలేదని, ఆయన ఆత్మ పరలోకానికి వెళ్లిపోయినట్టు మాత్రమే ఉందని అన్నారు పాల్. ప్రశాంత మరణాన్ని ఆయన పొందారని చెప్పారు.