Telugu Global
Telangana

కమిషన్‌ ఛైర్మన్‌గా తప్పుకుంటున్నా.. జస్టిస్‌ నరసింహారెడ్డి లేఖ

రేవంత్ సర్కార్‌ ఏర్పాటు చేసిన కమిషన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్. ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కమిషన్‌ ఛైర్మన్‌గా తప్పుకుంటున్నా.. జస్టిస్‌ నరసింహారెడ్డి లేఖ
X

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పవర్ సెక్టార్‌లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించింది రేవంత్ స‌ర్కార్‌. ఈ నేప‌థ్యంలో విచారణ కోసం ప్ర‌త్యేకంగా కమిషన్‌ను నియ‌మించింది. ఆ క‌మిష‌న్‌కు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.

జస్టిస్ నరసింహా రెడ్డి లేఖలో ఏముందంటే..?

విద్యుత్‌ రంగంలో అవకతవకలకు సంబంధించి మీడియా ఊహాజనిత వార్తలను రాసిందని, ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకే తాను ప్రెస్‌ కాన్ఫరెన్స్ నిర్వహించానన్నారు జస్టిస్ నరసింహా రెడ్డి. ఆ ప్రెస్‌మీట్‌లో విచారణ జరుగుతున్న తీరు, పురోగతిని వివరించానన్నారు. ఓ న్యాయమూర్తి లేదా ఓ మాజీ న్యాయమూర్తి తాను ఎవరికీ పక్షపాతం వహించలేదని చెప్పాల్సిన రోజు వస్తే.. ఆ పదవి తన ప్రతిష్టను కోల్పోతుందన్నారు నరసింహారెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానన్నారు.




రేవంత్ సర్కార్‌ ఏర్పాటు చేసిన కమిషన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్. ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్‌ లూథ్రా.. కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సోమవారం లోపు కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది ప్రభుత్వం.

First Published:  16 July 2024 11:11 AM GMT
Next Story