విద్యుత్ కొనుగోళ్లపై కేసీఆర్‌కు నోటీసులు
తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకరరావు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా కమిషన్ ముందు హాజరయ్యారు.
BRS చీఫ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో కేసీఆర్ వివరణ కోరింది జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఐతే వివరణ ఇచ్చేందుకు జూన్ 30 వరకు గడువు కావాలని కోరారు కేసీఆర్.
యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్- PPAలపై నరసింహ రెడ్డి కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనపైనా విచారణ జరుగుతోంది.
సోమవారం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకరరావు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా కమిషన్ ముందు హాజరయ్యారు. సురేష్ చందా ఇంధన శాఖలో పనిచేసిన సమయంలో.. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఇద్దరి విచారణ తర్వాత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం గమనార్హం. కేసీఆర్ వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందన్నారు జస్టిస్ నరసింహ రెడ్డి. విద్యుత్ కొనుగోలు నిర్ణయాల్లో పాలు పంచుకున్న ఇతర అధికారులకు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు.