జూపల్లి మిస్.. జయసుధ ఫిక్స్
ఈరోజు బీజేపీలో చేరుతున్న సినీ నటి జయసుధ ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. దాదాపుగా టికెట్ ఖాయం చేసుకునే, జయసుధ కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతల చేరికలకు హస్తిన వేదికగా మారింది. జూపల్లి టీమ్ మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకోగా ఈరోజు ఉదయం ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తాడని అనుకున్నారు. కానీ ఆ కార్యక్రమం వాయిదా పడింది. అనివార్య కారణాలతో జూపల్లి చేరిక రేపటి(గురవవారం)కి వాయిదా పడిందని తెలిపారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. రేపు ఉదయం మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో.. జూపల్లి కృష్ణారావు, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, గురునాధ్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరతారని చెప్పారాయన. త్వరలోనే బీజేపీ నుంచి కూడా చేరికలు ఉంటాయన్నారు. జూపల్లి ఢిల్లీలో కండువా కప్పుకున్నా.. త్వరలో కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
కాషాయ దళంలోకి జయసుధ..
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయసుధ ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఆమె బీజేపీలో చేరడం లాంఛనమేనని తేలిపోయింది. ఈరోజు ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జేపీ నడ్డా సమక్షంలో జయసుధ కాషాయి కండువా కప్పుకోబోతున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, బండి సంజయ్ కూడా ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు.
టికెట్లు ఖాయమేనా..?
1999నుంచి 2018 వరకు జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ శాసన సభ్యుడిగా గెలుస్తూ వచ్చారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ నేత బీరం హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే బీరం ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరడంతో జూపల్లికి కొల్లాపూర్ టికెట్ పై అనుమానం మొదలైంది. దీంతో ఆయన చివరకు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కొల్లాపూర్ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తలపడతారని తెలుస్తోంది. ఇక బీజేపీలో చేరుతున్న సినీ నటి జయసుధ ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. దాదాపుగా టికెట్ ఖాయం చేసుకునే, జయసుధ కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.