Telugu Global
Telangana

పార్టీలో చేరాలంటే 15 సీట్లు ఇవ్వాలా..?

టికెట్ల పంచాయితీ తేలకపోవడం వల్లే చేరికల ముహూర్తాన్ని వాయిదావేస్తూ వస్తున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామనే హామీతో త్వరలోనే ఈ ఇద్దరు నేతల్ని హస్తం గూటికి చేర్చుకోనున్నారట కాంగ్రెస్‌ నేతలు.

పార్టీలో చేరాలంటే 15 సీట్లు ఇవ్వాలా..?
X

పార్టీలో చేరాలంటే 15 సీట్లు ఇవ్వాలా..?

గులాబీ దళపతిపై యుద్ధాన్ని ప్రకటించిన బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఏ గట్టుకు చేరుతారనే సందేహం తెలంగాణ పాలిటిక్స్‌ని తొలిచేస్తోంది. ఈ ఇద్దరు నేతల్ని తమ గూటికి చేర్చుకునేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. కాషాయదళానికి నిరాశే ఎదురైనట్లు ఇప్పటికే స్పష్టమైంది. బీజేపీలోకి ఆహ్వానించేందుకు చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక కాంగ్రెస్‌ నేతలు కూడా పొంగులేటి, జూపల్లిని తమ జట్టులో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నమే చేస్తున్నారు. కానీ... ఆ ముహూర్తం ఎప్పుడనేది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.

పొంగులేటి, జూపల్లి జంట కహానీ తెలుగు సీరియల్‌ను తలపిస్తోంది. హస్తం నేతలు ఇప్పటికే దఫ దఫాలుగా ఈ ఇద్దరి నేతలతో మంతనాలు జరిపారు. మొన్న మల్లు రవి, ఆ మర్నాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌ బాబు రాయబారం నడిపారు. ఈ మధ్యలో బెంగళూరులో డీకే శివకుమార్‌ సమక్షంలో రేవంత్‌, పొంగులేటి, జూపల్లి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా ప్రియాంక గాంధీతో ఫోన్‌లో సంభాషించినట్లూ వినిపిస్తోంది. ఇంత జరిగినా ఈ జంట పక్షుల కహానీ కొలిక్కిరాకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికిలోనుచేస్తోంది.

జూపల్లి, పొంగులేటి హస్తం గూటికి చేరడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ కండిషన్స్‌ అప్లైడ్‌ అంటున్నారట. తమ వర్గానికి 15 అసెంబ్లీ టికెట్లు కెటాయించాలని డిమాండ్ చేస్తున్నారట. జూపల్లి తన వర్గానికి 4 టికెట్లు, పొంగులేటి 11 టికెట్లు ఆశిస్తున్నారట. తమ డిమాండ్‌కు సరే అంటే తప్ప పార్టీలో చేరమని తేల్చిచెప్పారట. అయితే... కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం ఈ విషయంలో బేరసారాలకు తావులేకుండా నాలుగు స్థానాలకు మించి కేటాయించలేమని తేల్చిచెప్పిందట. కాంగ్రెస్‌ ప్రతిపాదనకు తలొగ్గితే తమను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేమని పొంగులేటి, జూపల్లి జంట మదనపడుతోంది.

టికెట్ల పంచాయితీ తేలకపోవడం వల్లే చేరికల ముహూర్తాన్ని వాయిదావేస్తూ వస్తున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామనే హామీతో త్వరలోనే ఈ ఇద్దరు నేతల్ని హస్తం గూటికి చేర్చుకోనున్నారట కాంగ్రెస్‌ నేతలు. మరి ఆ ముహూర్తం ఎప్పుడో చూడాలి.

First Published:  13 Jun 2023 11:31 AM IST
Next Story