లాంఛనం పూర్తి.. కండువా కప్పుకున్న జూపల్లి
గాంధీ కుటుంబ సభ్యులెవరూ లేకుండానే మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు జూపల్లి. కొల్లాపూర్ టికెట్ తోపాటు జూపల్లి తన అనుచరులకు కూడా టికెట్లు కావాలనే డిమాండ్ ని అధిష్టానం ముందుంచారు. అనేక తర్జన భర్జనల అనంతరం ఆయన కాంగ్రెస్ లో చేరారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఈ లాంఛనం పూర్తయింది. రెండురోజులుగా జూపల్లి చేరిక ఉత్కంఠ రేపుతోంది, చివరకు ఈరోజు ఆయన కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎంపీపి మేఘా రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరికల కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మానిక్ రావు ఠాక్రే కూడా హాజరయ్యారు.
ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షులు శ్రీ @kharge గారు మరియు టిపిసిసి అధ్యక్షులు శ్రీ @revanth_anumula గారి సమక్షంలో.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు, వనపర్తి నేత మెగారెడ్డి మరియు పలువురు ముఖ్య… pic.twitter.com/izWhfHxGni
— Telangana Congress (@INCTelangana) August 3, 2023
వాస్తవానికి జూపల్లి, కొల్లాపూర్ లో భారీ సభ ఏర్పాటు చేసి, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు. ఆ సమయం కోసం కొన్నాళ్లు వేచి చూశారు. కానీ ప్రియాంక పర్యటన ఇప్పుడప్పుడే సాధ్యపడదు అని తేలడంతో ఆయనే ఢిల్లీకి వచ్చారు. అక్కడ కూడా గాంధీ కుటుంబ సభ్యులెవరూ లేకుండానే మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. కొల్లాపూర్ టికెట్ తోపాటు జూపల్లి తన అనుచరులకు కూడా టికెట్లు కావాలనే డిమాండ్ ని అధిష్టానం ముందుంచారు. అనేక తర్జన భర్జనల అనంతరం ఆయన కాంగ్రెస్ లో చేరారు.
పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ వేటు వేసిన తర్వాత ఆ ఇద్దరు నాయకులు సేఫ్ జోన్ కోసం కొన్నాళ్లు వేచి చూశారు. బీజేపీ, కాంగ్రెస్ లో ఏ గట్టుకెళ్లాలా అని తీవ్రంగా ఆలోచించారు. చివరకు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇద్దరూ ఒకేసారి మాత్రం కాంగ్రెస్ లో చేరలేదు. ఖమ్మంలో భారీ బహిరంగ సభలో పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే, ఢిల్లీ వెళ్లి హస్తం పార్టీలో చేరారు జూపల్లి. వీరి చేరికతో తెలంగాణలో కాంగ్రెస్ ఏమేరకు బలపడుతుందో వేచి చూడాలి.