ప్రభుత్వ హెచ్చరికలతో దిగొచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు - సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడి
జేపీఎస్‌ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, ఇతర ప్రతినిధులు శనివారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలిశారు. సమ్మె విరమించామని, సోమవారం నుంచి విధుల్లో చేరతామని తెలిపారు.
తెలంగాణలో 16 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌లు) శనివారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి వెల్లడించారు. క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లతో వారు ఈ సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పలు జిల్లాల్లో అనేకమంది జేపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరారు.
శనివారం మధ్యాహ్నం లోపు విధుల్లో చేరనివారిని తొలగించాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం వరకు ఎవరైనా విధుల్లో చేరకుంటే.. వారి స్థానంలో తాత్కాలికంగా కొత్తవారిని నియమించాలని ఆదేశించారు. ఈ హెచ్చరికలు జేపీఎస్‌లపై బలంగా ప్రభావం చూపాయి.
కొంతమంది రాష్ట్ర సంఘం నిర్ణయం కోసం ఎదురుచూసినా.. శనివారం సాయంత్రానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని జేపీఎస్‌లూ సమ్మె విరమించారు. ఈ నేపథ్యంలో జేపీఎస్‌ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, ఇతర ప్రతినిధులు శనివారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలిశారు. సమ్మె విరమించామని, సోమవారం నుంచి విధుల్లో చేరతామని తెలిపారు. తమకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.