Telugu Global
Telangana

నేటినుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె

ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు జూనియర్ డాక్టర్లు. దాదాపు 4 వేల మంది సమ్మెలో పాల్గొనబోతున్నారు.

నేటినుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె
X

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. నేటి నుంచి విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన డాక్టర్లు నాలుగు రోజులుగా విధులకు హాజరవుతూనే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు సమ్మెకు సిద్ధమయ్యారు. నేటినుంచి విధులను బహిష్కరించబోతున్నట్టు ప్రకటించారు.

జూడాల డిమాండ్లు..

- ఎంబీబీఎస్‌ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలి.

- ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలి, పోలీసులతో సెక్యూరిటీ కల్పించాలి.

- హాస్టల్‌ భవనాల నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల చేయాలి.

- ఉస్మానియా ఆస్పత్రికి వెంటనే కొత్త బిల్డింగ్ నిర్మించాలి

- కాకతీయ మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్నల్ రోడ్ల సమస్య పరిష్కరించాలి.

- ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ రిలీజ్ చేయాలి

- సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్ల గౌరవ వేతనం రూ.1.25 లక్షలకు పెంచాలి

ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ నేతలు జూనియర్ డాక్టర్లకు పలు హామీలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆమేరకు ఇటీవల పలుమార్లు మంత్రుల్ని కలసి వినతిపత్రాలు అందించారు జూడాలు. కానీ పని జరగలేదు. గత నెల 20న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వగా, 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో జూడాలు వెనక్కి తగ్గారు. నెల గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేరకపోవడంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆ తర్వాతి రోజు నుంచి నిరసన ప్రదర్శనలు చేపట్టినా ఫలితం లేదు. దీంతో ఈరోజు నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు జూనియర్ డాక్టర్లు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. దాదాపు 4 వేల మంది సమ్మెలో పాల్గొనబోతున్నారు.

First Published:  24 Jun 2024 7:48 AM IST
Next Story