Telugu Global
Telangana

మేం కూడా ధరణి రద్దు చేస్తాం -జేపీ నడ్డా

నాగర్ కర్నూల్ సభ బీజేపీ స్తుతి, బీఆర్ఎస్ పై నింద అనేలా సాగింది. ఈటల, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో కుస్తీలు పడుతుంటే ఇక్కడ మిగతా నేతలతో కలసి నడ్డా సభ పెట్టారు, వచ్చే ఎన్నికల్లో తమదే విజయమంటూ జబ్బలు చరుచుకున్నారు.

మేం కూడా ధరణి రద్దు చేస్తాం -జేపీ నడ్డా
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా ధరణి కీలక అంశం కాబోతోంది. ధరణి కావాలనుకున్నవారు ఒకవైపు, వద్దనుకునేవారు మరోవైపు అన్నట్టుగా ఓట్లు చీలబోతున్నాయి. ధరణి పోర్టల్ తో ప్రజలు సంతోషంగా ఉన్నారని అంటోంది బీఆర్ఎస్. అయితే తాము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చింది, తాజాగా బీజేపీ కూడా అదే మాట నొక్కి వక్కాణించింది. నాగర్ కర్నూల్ లో జరిగిన బీజేపీ నవ సంకల్ప సభలో పాల్గొన్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెప్పారు.

ఆత్మస్తుతి..

తెలంగాణ పట్ల బీజేపీ ఎంత వివక్ష ప్రదర్శించిందో అందరికీ తెలిసిన విషయమే. కంటోన్మెంట్ బోర్డ్ భూముల్ని ఇతర రాష్ట్రాల్లో ఉదారంగా కార్పొరేషన్లకు బదలాయిస్తున్న కేంద్రం, తెలంగాణ విషయంలో మాత్రం కఠినంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా, బియ్యం కొనుగోళ్లు, మెడికల్ కాలేజీల మంజూరు.. ఇతరత్రా విషయాల్లో కూడా తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్ అభ్యర్థనలు వినేందుకు కూడా కేంద్ర మంత్రి అమిత్ షా సిద్ధంగా లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే నాగర్ కర్నూల్ సభలో మాత్రం జేపీ నడ్డా తెలంగాణపై ఎక్కడలేని ప్రేమ చూపించారు. ప్రధాని మోదీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ తెలంగాణ అభివృద్ధికి కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు నడ్డా. ఇటీవల తెలంగాణకు వచ్చిన మోదీ రూ.11 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా రైల్వే విషయంలో అది చేశాం, ఇది చేశామని గొప్పలు చెప్పుకున్నారు. లాభాల్లో దూసుకుపోతున్న దక్షిణ మధ్య రైల్వేకి ఆమాత్రం సాయం చేయకపోతే విమర్శలు వస్తాయి కాబట్టే కేంద్రం సాయం చేసింది, అంతే కానీ తెలంగాణపై ప్రత్యేక ప్రేమ లేదని తేలిపోయింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులైనా, భారత్ లో మాత్రం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు నడ్డా. మరి నిత్యావసరాల ధరలు ఈ స్థాయిలో ఎందుకు చుక్కలనంటుతున్నాయనేది మాత్రం చెప్పలేదు. గ్యాస్ సిలిండర్ రేటు ప్రస్తావించడానికి కూడా ఆయన సాహసం చేయలేదు. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అణచివేశామని చెప్పుకున్న నడ్డా, మణిపూర్ అల్లర్లను శాంతింపజేయడానికి ఏం చేశారనేది చెప్పుకోలేకపోయారు. మొత్తమ్మీద నాగర్ కర్నూల్ సభ బీజేపీ స్తుతి, బీఆర్ఎస్ పై నింద అనేలా సాగింది. ఈటల, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో అధిష్టానంతో కుస్తీలు పడుతుంటే ఇక్కడ మిగతా నేతలతో కలసి నడ్డా సభ పెట్టారు, వచ్చే ఎన్నికల్లో తమదే విజయమంటూ జబ్బలు చరుచుకున్నారు.

First Published:  26 Jun 2023 12:58 AM GMT
Next Story