Telugu Global
Telangana

జహీరాబాద్ లోక్‌సభ బరిలో జీవితా రాజశేఖర్?

తనకు టికెట్ కచ్చితంగా కేటాయిస్తేనే పార్టీలో చేరతానని జీవిత కండిషన్ పెట్టారని.. దానికి జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఓకే చెప్పారని తెలుస్తోంది. అసెంబ్లీకి కాకుండా లోక్‌సభకు ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారు.

జహీరాబాద్ లోక్‌సభ బరిలో జీవితా రాజశేఖర్?
X

తెలంగాణలో అధికారంతో పాటు దక్షిణాదిలో ఈ సారి ఎంపీ సీట్లు పెంచుకోవాలని బీజేపీ అధిష్టానం అనుకుంటోంది. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు ఇక్కడ వాలిపోతున్నారు. ఇటీవల చేసిన సర్వేలో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్లు బీజేపీకి తగిన అభ్యర్థులు లేని విషయం వెల్లడైంది. ముఖ్యంగా లోక్‌సభ బరిలో నిలవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్లామర్ టచ్ ఇస్తే అయినా సీట్లు గెలుస్తామేమో అని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కలిసి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. రాజకీయాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన జీవితా రాజశేఖర్.. ఇప్పటికే పలు పార్టీలు మారారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీల్లో చేరినా.. సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే కారణంతో పార్టీలను వదిలేసి.. చివరకు బీజేపీ పంచన చేరారు.

తనకు టికెట్ కచ్చితంగా కేటాయిస్తేనే పార్టీలో చేరతానని జీవిత కండిషన్ పెట్టారని.. దానికి జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఓకే చెప్పారని తెలుస్తోంది. అసెంబ్లీకి కాకుండా లోక్‌సభకు ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమెకు ఆ విషయంలో హామీ లభించిన తర్వాతే బీజేపీలో యాక్టీవ్‌గా మారిపోయినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ పాదయాత్రలో, దీక్షలో ఆమె మెరుపులా మెరిశారు. అప్పుడే టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు చేస్తూ పొలిటికల్ మైలేజీ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారిపోయింది.

2009లో కాంగ్రెస్ తరపున సురేశ్ కుమార్ షెట్కర్ గెలవగా.. ఆ తర్వాత 2014, 2019లో వరుసగా టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపొందారు. కాగా, కర్ణాటక బార్డర్‌లో ఉండే ఈ నియోజకవర్గానికి ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఇంచార్జిగా వేశారు. బీజేపీ పార్లమెంట్ ఆవాస్ యోజన కార్యక్రమానికి సంబంధించి ఆమే ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. తన మనసులో మాటను ఇప్పటికే కేంద్ర మంత్రికి జీవిత చెప్పారని తెలుస్తోంది. అయితే అటు వైపు నుంచి మాత్రం ఎలాంటి హామీ రాలేదని సమాచారం. జీవిత మాత్రం జహీరాబాద్ నుంచి పోటీ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, జీవిత అభ్యర్థిత్వంపై హైకమాండ్‌కు అంతగా నమ్మకం లేదని తెలుస్తోంది. ఆమెకు జనాలు ఓట్లేస్తారా అనే అనుమానం కూడా ఉంది. హైదరాబాద్ నగరంలోని ఏదో ఒక అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో జీవిత ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

First Published:  22 Sept 2022 9:03 PM IST
Next Story