మళ్లీ టీ-సీఎల్పీకి జేసీ.. ఈసారి రేవంత్ పాదయాత్రపై నీళ్లు
తాజాగా సీఎల్పీకి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి.. అబ్బే రేవంత్ రెడ్డి పాదయాత్రతో ఉపయోగం లేదండి అని తేల్చేశారు. పాదయాత్రలకు కాలం చెల్లిపోయిందన్నారు. రేవంత్ చేసినా, లోకేష్ చేసినా పాదయాత్రల వల్ల ఉపయోగం ఉండదని తేల్చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగితే చాలు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సీఎల్పీ కార్యాలయానికి వచ్చేయడం పరిపాటిగా మారింది. గతంలోనూ ఇలా వెళ్లిన జేసీ.. కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని 2021లోనే సీఎల్పీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ నాయకుల ముఖం మీదే చెప్పేశారు. ఆ సమయంలో మా పార్టీ ఆఫీస్‌కే వచ్చి మా పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని జీవన్ రెడ్డి సీరియస్ కూడా అయ్యారు.
ఇక గతేడాది సెప్టెంబర్‌లోనూ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి.. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఓడిపోతారని తాను ముందే చెప్పా అంటూ గిల్లారు. రాహుల్ గాంధీ పెళ్లిపైనా, సోనియా గాంధీ రాష్ట్ర విభజన సమయంలో వ్యవహరించిన తీరుపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ అలా మాట్లాడిన సమయంలో కాంగ్రెస్ నేతలు కామ్‌గా ఉండడాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు తర్వాత హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు వచ్చేలా మాట్లాడబోనని జేసీ హామీ కూడా ఇచ్చారు.
తాజాగా సీఎల్పీకి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి.. అబ్బే రేవంత్ రెడ్డి పాదయాత్రతో ఉపయోగం లేదండి అని తేల్చేశారు. పాదయాత్రలకు కాలం చెల్లిపోయిందన్నారు. రేవంత్ చేసినా, లోకేష్ చేసినా పాదయాత్రల వల్ల ఉపయోగం ఉండదని తేల్చేశారు. పాదయాత్రలను జనం పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పాదయాత్రలన్నీ డబ్బుతో నడుస్తున్నవేనన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలోనే జేసీ దివాకర్ రెడ్డి ఇలా పాదయాత్ర వేస్ట్ అని చెప్పడం.. అది కూడా సీఎల్పీ కార్యాలయానికే వెళ్లి చెప్పడం కాంగ్రెస్‌కు చికాకు కలిగించేదే!.