Telugu Global
Telangana

12 చరణాలు.. 13.30 నిమిషాలు.. జయజయహే ఫుల్ వెర్షన్

'ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి'.. అంటూ పాత పాట ముగుస్తుంది. ఇప్పుడు రాష్ట్రం సిద్ధించింది కాబట్టి 'ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి' అని కొత్త పాటలో ముగింపు వాక్యాన్ని చేర్చారు.

12 చరణాలు.. 13.30 నిమిషాలు.. జయజయహే ఫుల్ వెర్షన్
X

జయజయహే తెలంగాణ పూర్తి స్థాయి గీతం విడుదలకు సిద్ధమైంది. మొత్తం 12 చరణాలు ఈ పాటలో ఉన్నాయి. పాటని పూర్తి స్థాయిలో ఆలపించేందుకు 13.30 నిమిషాల సమయం పడుతుంది. ఇది ఫుల్ వెర్షన్. తెలంగాణ రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించేందుకు రెండున్నర నిమిషాల మరో వెర్షన్ కూడా సిద్ధమైంది. అందెశ్రీ సాహిత్యానికి కీరవాణి స్వరాలందించారు. జూన్-2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పాటలను అధికారికంగా విడుదల చేస్తారు.




మార్పులు, చేర్పులు..

తెలంగాణ ఆవిర్భావాన్ని ఆకాంక్షిస్తూ గతంలో అందెశ్రీ రాసిన పాటకు ఇప్పుడు మార్పులు చేర్పులు చేశారు. పది జిల్లాల తెలంగాణ అనే పదాన్ని తొలగించి 'పద పదాన' అనేది చేర్చారు. 'ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి'.. అంటూ పాత పాట ముగుస్తుంది. ఇప్పుడు రాష్ట్రం సిద్ధించింది కాబట్టి 'ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి' అని కొత్త పాటలో ముగింపు వాక్యాన్ని చేర్చారు. 'నవాబులు' అనే పదాన్ని తొలగించి ఆ స్థానంలో 'భాగ్యనగరి' అనే పదాన్ని చేర్చారు. ఫుల్ వెర్షన్ కోసం అందెశ్రీ కొత్త చరణాలు రాశారు. ఇందులో పంపన, బద్దెన, భీమకవి, హాలుడు, పాల్కురికి సోమనాథుడు, కాళిదాసు, మల్లినాథసూరి వంటి ఆది కవుల ప్రాశస్త్యాన్ని వివరించారు. జయజయహే పాట తుదిరూపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఇందులోని చరణాలు ప్రస్తావనకు వచ్చాయి.

జయజయహే ఫుల్ వెర్షన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నగీతం ఇది.

1) జయజయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరితగల తల్లీ నీరాజనం

పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

2) పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి

భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి

హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల

బృహత్కథల తెలంగాణ కోటి లింగాల కోన

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

3) ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన

తెలుగులో తొలి ప్రజాకవి ‘పాలకుర్కీ’ సోమన్న

రాజ్యాన్ని ధిక్కరించి రాములోరి గుడిని గట్టి

కవిరాజై వెలిగె దిశల ‘కంచర్ల గోపన్న’

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

4) కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి

‘మల్లినాథసూరి’ మా మెతుకు సీమ కన్నబిడ్డ

ధూళికట్ట నేలినట్టి భౌద్ధానికి బంధువతడు

ధిజ్ఞాగుని గన్న నేల ధిక్కారమే జన్మహక్కు

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

5) ‘పోతన’దీ పురిటిగడ్డ.. ‘రుద్రమ’దీ వీరగడ్డ

గండరగండడు ‘కొమురం భీముడే’ నీ బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప

గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

6) రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల

‘సర్వజ్ఞ సింగ భూపాలుని’ బంగరుభూమి

వాణీ నా రాణి అంటూ నినదించిన కవి కులరవి

‘పిల్లలమర్రి పినవీరభద్రుడు’ మాలో రుద్రుడు

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

7) ‘సమ్మక్క’లు ‘సారక్క’లు సర్వాయి పాపన్నలు

సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు

ఊరూర పాటలైన ‘మీరసాబు’ వీరగాథ

దండు నిడిపే పాలమూరు ‘పండు గొల్ల సాయన్న’

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

8) కవిగాయక వైతాళిక కళల మంజీరాలు

డప్పు, ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు

పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ

అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

9) జానపద జనజీవన జావళీలు జాలువార

జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర

వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతెనేమి

తరుగనిదీ నీ త్యాగం మరువనదీ శ్రమ యాగం

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

10) బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి

విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి

తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక

ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మ వెలగాలి

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

11) సిరివెలుగులు జిమ్మే సింగరేణి బంగారం

అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం

సహజమైన వనసంపద సక్కనైన పువ్వుల పొద

సిరులు పండె సారమున్న మాగాణమె కదా నీ యెద

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

12) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా

పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి

ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ

First Published:  31 May 2024 8:03 AM IST
Next Story