బోరున ఏడ్చిన జనగామ మహిళా మున్సిపల్ కమిషనర్
వినాయక నిమజ్జనానికి సంబంధించిన బిల్లుల విషయంలో ఆర్డీవో మధుమోహన్ తనను గతంలో ప్రశ్నించారని.. ఆ సమయంలో తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించానని చెప్పానని రజిత వివరించారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత కన్నీటి పర్యంతమయ్యారు. బోరున విలపించారు. ఆర్డీవో మధుమోహన్ తనను చులకనగా మాట్లాడుతూ, పదేపదే అవమానిస్తున్నారని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజావాణి కార్యక్రమంలో అందరి సమక్షంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. దాంతో ఆమెను కలెక్టర్ శివలింగయ్య ఓదార్చే ప్రయత్నం చేశారు.
వినాయక నిమజ్జనానికి సంబంధించిన బిల్లుల విషయంలో ఆర్డీవో మధుమోహన్ తనను గతంలో ప్రశ్నించారని.. ఆ సమయంలో తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించానని చెప్పానని రజిత వివరించారు. దాంతో మధుమోహన్ తనను అవహేళన చేసేలా '' ఏం చదివావు.. నీకు ఉద్యోగం ఎలా వచ్చింది?'' అంటూ మాట్లాడారని మున్సిపల్ కమిషనర్ వివరించారు.
తాజా ఒక అర్జీ విషయంలో ఇతర ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆర్డీవో మధుమోహన్ తనను చులకనగా మాట్లాడటంతో రజిత భరించలేకపోయారు. తాను బాధ్యతలు చేపట్టిన రెండు నెలల నుంచి ఆర్డీవో మధుమోహన్ తనను ఇలాగే అవమానిస్తున్నారని ఆమె కన్నీరుపెట్టుకున్నారు.