ఉమ్మడి మేనిఫెస్టో కోసం టీడీపీ-జనసేన కసరత్తు.. కీలక సమావేశానికి పవన్ డుమ్మా
ఈ కీలక మీటింగ్ కి పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టడం విశేషం. తన స్థాయిలో తాను ఇకపై చంద్రబాబు, మోదీ లాంటి వ్యక్తుల్నే కలవాలి అనుకున్నారో ఏమో.. లోకేష్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్న ఈ మీటింగ్ కి పవన్ డుమ్మా కొట్టారు.
ఏపీలో ఇప్పటికే టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించి భవిష్యత్తుకి గ్యారెంటీ అంటూ ప్రజల్లోకి వెళ్లింది. ఆ ప్రచారంలో ఉండగానే చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జనసేన వారితో అధికారికంగా జతకలిసింది. దీంతో రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోకోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ దిశగా ఈరోజు రెండో సమావేశం జరిగింది. ఈ కీలక మీటింగ్ కి పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టడం విశేషం. తన స్థాయిలో తాను ఇకపై చంద్రబాబు, మోదీ లాంటి వ్యక్తుల్నే కలవాలి అనుకున్నారో ఏమో.. లోకేష్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్న ఈ మీటింగ్ కి పవన్ డుమ్మా కొట్టారు.
రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకున్నామని ఈ సమావేశం అనంతరం నాయకులు ప్రకటించారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన ఎజెండాగా సమన్వయ కమిటీ రెండో సమావేశం జరిగిందన్నారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రోజుల చొప్పున టీడీపీ - జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామన్నారాయన. ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తమ మినీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లిందని, జనసేన ఇచ్చే ఐదారు పాయింట్లను కూడా వీటిలో కలుపుతామని చెప్పారు.
ఈనెల 17 నుంచి ఉమ్మడిగా జనంలోకి..
ఇప్పటి వరకు టీడీపీ, జనసేన విడివిడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇప్పుడు ఉమ్మడిగా జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు నాయకులు. ఈనెల 17నుంచి టీడీపీ-జనసేన కలిపి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాల్లో పాల్గొంటాయని తెలిపారు నాయకులు. ఈనెల 13న ఉమ్మడి మేనిఫెస్టో కోసం సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటామన్నారు.