Telugu Global
Telangana

తెలంగాణలో జనసేన ప్రభావం ఉంటుందా?

తెలంగాణలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏమీ లేదు. కొత్తగా వచ్చే పార్టీలు సీట్లు గెలిచి ప్రధాన పార్టీల గెలుపును ప్రభావితం చేస్తాయనే అంచనాలు కూడా లేవు.

తెలంగాణలో జనసేన ప్రభావం ఉంటుందా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏపీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న జనసేన.. తెలంగాణలో కూడా పోటీ చేయాలని నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగానే 2023 ఆఖర్లో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జనసేనాని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. వీటికి తోడు ప్రవీణ్ కుమార్ సారథ్యంలో బీఎస్పీ, వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్ఆర్టీపీలు పోటీ పడటానికి ఉత్సాహంగా ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ బలంగా ఉన్నది. వీటన్నింటికి తోడు టీడీపీ, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి, లోక్‌సత్తా వంటి పార్టీలు బరిలో ఉండనున్నాయి.

తెలంగాణలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏమీ లేదు. కొత్తగా వచ్చే పార్టీలు సీట్లు గెలిచి ప్రధాన పార్టీల గెలుపును ప్రభావితం చేస్తాయనే అంచనాలు కూడా లేవు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టీఆర్ఎస్ బలంగా పాతుకొని పోయింది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్నది. టీడీపీ ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపిస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ అధికారంలోకి రావాలని చూస్తోంది. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటి నుంచో తెలంగాణ ప్రాంతంలో బలంగా ఉన్నా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీట్లు గెలుచుకోలేక పోతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీకి తిరుగేలేదు. ఇక బహుజనుల ఓట్లే లక్ష్యంగా బీఎస్పీ, వైఎస్ఆర్ అభిమానుల ఓట్ల కోసం వైఎస్ఆర్టీపీ పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన బరిలోకి దిగితే ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది అనుమానమే.

సినీ నటుడుగా పవన్ కల్యాణ్‌కు తెలంగాణ ప్రాంతంలో అభిమానులు ఉన్నారనేది వాస్తవం. అతడి సినిమాలు నైజాం ఏరియాలో రికార్డులు సృష్టిస్తుంటాయి. కానీ, ఆంధ్రాలో మాదిరి తెలంగాణలో సినీ నటులకు బ్రహ్మరథం పట్టే అవకాశం లేదు. ఇక్కడ సినిమాలు, రాజకీయాలను వేర్వేరుగానే చూస్తారు. కొండగట్టు నుంచి తెలంగాణలో రాజకీయం మొదలు పెడతానని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 7 నుంచి 14 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని పవన్ చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా 2 లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు. మరి జనసేన పోటీ చేస్తే ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందా? అంటే విశ్లేషకులు కాదనే అంటున్నారు.

జనసేన పార్టీ ఆవిర్భవించి 8 ఏళ్లు గడిచిపోయింది. 2014 ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. ఇక 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినా ఒకే ఒక సీటు గెలిచింది. స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. మొత్తంగా ఏపీలో 7 శాతం ఓట్లు మాత్రం సాధించింది. ఇక ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. రాష్ట్రంలో అసలు జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు. నియోజకవర్గాల ఇంచార్జులను ఇటీవల నియమించినా.. వారేమీ పెద్దగా ప్రభావం చూపే వ్యక్తులు కారు. చిరంజీవి, పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కు చెందిన వ్యక్తులే ప్రస్తుతం జనసేనకు బాధ్యులుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేంత అంగ, ఆర్థిక బలం ఉన్న వ్యక్తులు కాకపోవడంతో.. ఇప్పుడు ఆ పార్టీ కొత్తగా అభ్యర్థులను వెతుక్కోవాలి.

రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే బీజేపీ వ్యవహార శైలి పట్ల పవన్ కల్యాణ్ అసంతృప్తితో ఉన్నారు. కానీ, ఎన్నికల నాటికి బీజేపీ-టీడీపీతో జనసేన కలుస్తుందనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అంతిమంగా టీఆర్ఎస్‌కు లాభిస్తుందనే చర్చ కూడా జరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు జనసేన ప్రభావం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా కేసీఆర్ ఆ పార్టీని కట్టడి చేయడానికి ఏదో ఒక వ్యూహం అయితే సిద్ధం చేస్తారు.

ఆ మధ్య ఒకసారి తెలంగాణ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ బహిరంగంగానే వ్యతిరేకత ప్రదర్శించారు. తెలంగాణ విడిపోయిందని తాను 11 రోజులు అన్నం తినకుండా బాధపడ్డానని వాపోయారు. ఈ వ్యాఖ్యలు ఇంకా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ రేపు పవన్ బరిలోకి దిగితే మాత్రం వీటిని తప్పకుండా రాజకీయంగా వాడుకునే అవకాశం ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి పవన్ వ్యతిరేకుడనే విధంగా టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ కూడా చిత్రించే అవకాశం ఉన్నది. మరి పవన్ వాటిని ఎలా సమర్థించుకుంటాడో చూడాలి.

మొత్తంగా చూస్తే తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల పెద్దగా ప్రభావమేమీ ఉండదు. కానీ బీజేపీ, టీడీపీలతో కలిసి పొత్తుకు వెళితే మాత్రం కాస్తోకూస్తో ఓట్లను చీల్చే అవకాశం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్లను ఆశించి భంగపడే వారు జనసేన వైపు చూసే అవకాశం ఉన్నది. గతంలో ప్రధాన పార్టీల నుంచి టికెట్లు రాని వాళ్లు బీఎస్పీ నుంచి రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ బీఎస్పీ మొత్తం ప్రవీణ్ కుమార్ చేతిలో ఉండటంతో.. అలాంటి రెబెల్ అభ్యర్థులకు జనసేన ఒక ఛాయిస్‌లా మారవచ్చు. ఏదేమైనా తెలంగాణ రాజకీయ బరిలోకి జనసేన రావడం పవన్ ఫ్యాన్స్‌కు అయితే పండగే అని చెప్పుకోవచ్చు.

First Published:  19 Oct 2022 6:17 AM IST
Next Story