ఏపీలో దిక్కులేదు కానీ..
బీజేపీ గురించే కాదు చివరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏమి మాట్లాడకుండా పవన్ చేయబోయే రాజకీయం ఏమిటో అర్థంకావటంలేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది జనసేనే అని ఒకసారంటారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖాయమని మరోసారి ప్రకటిస్తారు. రెండింటిలో ఏది కరెక్టో తెలీక పార్టీలో నేతలకు అయోమయం పెరిగిపోతోంది. ఎందుకంటే.. ప్రకటనలు చేస్తున్న పవన్ దాన్ని ఆచరణలో మాత్రం చూపటంలేదు. పొత్తులపై క్లారిటీ ఇవ్వమని, ఎన్నిసీట్లలో పోటీచేస్తున్నారనే విషయాన్ని ఫైనల్ చేయమని నేతలు నెత్తీనోరు కొట్టుకుంటున్నా.. పవన్ మాత్రం పట్టించుకోవటంలేదు.
సీన్ కట్ చేస్తే తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే విషయమై జనసేన నేతలతో పవన్ సమావేశమయ్యారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సన్నాహక సమావేశం జరిపారు. నేతలను, శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయటంలో భాగంగా దిశానిర్దేశం చేశారట. విచిత్రం ఏమిటంటే.. పవన్ రాజకీయమంతా ఏపీలోనే సాగుతోంది. తెలంగాణలో ఇంతవరకు ఎక్కడా పర్యటించలేదు. ఏదో వాహనాలకు పూజలు చేయించినప్పుడు జనాలను ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడటం తప్ప చేసిందేమీలేదు.
ఏ జిల్లాలోనూ పర్యటించిందిలేదు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టిందీలేదు. తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడాలన్నా భయమే. బీజేపీ గురించే కాదు చివరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏమి మాట్లాడకుండా పవన్ చేయబోయే రాజకీయం ఏమిటో అర్థంకావటంలేదు. పవన్ బేస్ గోదావరి జిల్లానే కాబట్టి దాని ఆధారంగానే కాపులను ఆకట్టుకునేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. పార్టీపెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కాపుల్లో ఒక్క ప్రముఖుడు కూడా జనసేనలో చేరలేదు.
అలాంటిది సినిమాలు చేసుకోవటం, తెలంగాణాలో స్థిరపడ్డారన్న కారణంతో జనసేనకు తెలంగాణలో ఓట్లు పడతాయా..? సీట్లు గెలుస్తారా..? ఏపీలోనే దిక్కులేనప్పుడు ఇక తెలంగాణలో ఏమి చేయగలరో ఎవరికీ అర్థంకావటంలేదు. రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించినట్లే ఏపీ నేతలతో ఎందుకని పెట్టలేదు..? పైగా పొత్తులు, సీట్ల విషయం ఎవరు మాట్లాడద్దని నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. దిక్కులేని చోట హడావుడి చేస్తున్న పవన్ ఏపీ విషయంలో మాత్రం నోరే విప్పటంలేదు. చివరకు ఏమిచేస్తారో ఏమో..