తెలంగాణలో పోటీకి సై.. 32 నియోజకవర్గాలకు జనసేన ఇన్ చార్జ్ లు
ఓ వ్యూహం ప్రకారం తెలంగాణలో షర్మిలను ఎగదోస్తున్న బీజేపీ, అదే వ్యూహంతో ఎన్నికలనాటికి పవన్ కల్యాణ్ ని కూడా తెరపైకి తెస్తుందనే వార్తలు కూడా వినపడుతున్నాయి.
ఏపీలో అధికారం మాదే, సీఎం మా బాసే అంటున్నారు జనసైనికులు. వైసీపీ నుంచి మాత్రం అసలు మీ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా లేదా అనే ప్రశ్న వినపడుతోంది. ఏపీలో ఎన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలనే విషయంలో సైలెంట్ గా ఉన్న పవన్, ఇప్పుడు తెలంగాణలో నియోజకవర్గ ఇన్ చార్జ్ లను ప్రకటించి కలకలం రేపారు. 32 నియోజకవర్గాలకు గాను కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ నేమూరి శంకర్ గౌడ్. పవన్ ఆదేశాల మేరకు వారిని ఎంపిక చేశామని చెప్పారు.
కార్యనిర్వాహకుల కర్తవ్యం ఏంటి..?
తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించడం, పార్టీ పరిస్థితి అధ్యయనం చేసి ఆ నివేదికను అధిష్టానానికి సమర్పించడం. ఇదీ కార్యనిర్వాహకుల తక్షణ కర్తవ్యం. ఆ నివేదిక ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామంటున్నారు తెలంగాణ జనసేన ఇన్ చార్జ్. కార్యనిర్వాహకులే అభ్యర్థులా, లేక వారు సూచించిన వారు అభ్యర్థులా అనేది తేలాల్సి ఉంది.
ఎందుకీ హడావిడి..?
తెలంగాణ ఎన్నికలు, ఉప ఎన్నికల విషయంలో గతంలో చాలాసార్లు వెనకడుగు వేశారు పవన్ కల్యాణ్. చివరి నిమిషం వరకు ఊరించి మరీ పార్టీ శ్రేణులను నిరాశలోకి నెట్టేశారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా, లేక పవన్ నిజంగానే తెలంగాణలో పార్టీని బలపరచాలని భావిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఓ వ్యూహం ప్రకారం తెలంగాణలో షర్మిలను ఎగదోస్తున్న బీజేపీ, అదే వ్యూహంతో ఎన్నికలనాటికి పవన్ కల్యాణ్ ని కూడా తెరపైకి తెస్తుందనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్, తెలంగాణలో ఆ నియమాన్ని పాటిస్తారా లేక, కేవలం ఓట్లను చీల్చే విషయంలోనే బీజేపీకి ఉపయోగపడతారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద సడన్ గా తెలంగాణ రాజకీయాలపై నిర్ణయం తీసుకుని కలకలం రేపారు పవన్ కల్యాణ్.