జనసేన నేతలు ఒక్కొక్కరే బీఆర్ఎస్ వైపు..
సడన్ గా జనసేన నేత హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ ని కలసి శాలువా కప్పి సత్కరిస్తే కారణం లేదని అనుకోలేం. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా శాంతికుమారిని నియమించినందుకు కేసీఆర్ కు, రామ్మోహన్ రావు బీఆర్ఎస్ ఏపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో జనసేన ఖాళీ అవుతోందా..? ఒక్కొక్కరే బీఆర్ఎస్ వైపు అడుగులేస్తున్నారా..? ఏమో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. తోట చంద్రశేఖర్ చేరికతో ఏపీలో బీఆర్ఎస్ తొలి అడుగు వేసింది. ఆయనను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారు కేసీఆర్. ఆయనతోపాటు మరికొందరు జనసేన నేతలు అప్పుడే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జనసేన పార్టీ సలహాదారు, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని కలిశారు. ఈ కలయిక తర్వాత ఆయన చేరిక లాంఛనం అని అనుకోవచ్చు. కానీ చేరికల గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి, దానికింకా టైమ్ ఉందనుకోవచ్చు. బహుశా సంక్రాంతి తర్వాత విజయవాడలో కేసీఆర్ బహిరంగ సభలో ఆ లాంఛనం పూర్తి కావొచ్చు.
ఎందుకు కలిశారంటే..?
సడన్ గా జనసేన నేత హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ ని కలసి శాలువా కప్పి సత్కరిస్తే కారణం లేదని అనుకోలేం. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా శాంతికుమారిని నియమించినందుకు కేసీఆర్ కు, రామ్మోహన్ రావు బీఆర్ఎస్ ఏపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సీఎస్ శాంతికుమారిని వారు అభినందించారు.
ఇటీవల కాపు రిజర్వేషన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రామ్మోహన్ రావు వార్తల్లో వ్యక్తిగా మారారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, రిజర్వేషన్లు అందుకున్న వర్గాలు కూడా రాజ్యాధికారం లేక ఇబ్బంది పడుతున్నాయని, కాపులకు నిజమైన రాజ్యాధికారం వచ్చినప్పుడే ఆ వర్గం ముందంజలో ఉంటుందని చెప్పారు. కాపు రిజర్వేషన్ల గురించి, ఏపీలో కుల రాజకీయాల గురించి పూర్తి క్లారిటీతో ఉన్న రామ్మోహన్ రావు, ఇప్పుడు కేసీఆర్ వైపు అడుగులేయడం విశేషమే.
పవన్ కల్యాణ్ ని అభిమానించేవారిలో చాలామంది, ఆయన చంద్రబాబు వైపు చూడటాన్ని ఇష్టపడటంలేదు. ఒకవేళ పొత్తులో జనసేన కొన్ని సీట్లు గెలుచుకున్నా, అది టీడీపీకి బి టీమ్ లానే ఉండాలి కానీ, పూర్తి స్థాయిలో అధికారం చేజిక్కించుకోలేదు. చంద్రబాబుతో పవన్ పొత్తు రాజకీయం నచ్చని చాలామంది జనసేన నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అనుకోవచ్చు. రామ్మోహన్ రావు చేరిక ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ, ఆ వికెట్ పడితే, జనసేనకు మరింతమంది గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయి.