Telugu Global
Telangana

మునుగోడులో టీఆరెస్ దే విజయం ‍- జనంసాక్షి ఫైనల్ సర్వే

Munugode bypoll Survey Results: మునుగోడులో జరగనున్న ఉప ఎన్నికలో టీఆరెస్ విజయం సాధించనుందని 'జనంసాక్షి' పత్రిక చేసిన సర్వేలో వెల్లడైంది. టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాదాపు 30 వేలకు పైగా మెజార్టీతో గెలవనున్నారని 'జనంసాక్షి' స్పష్టం చేసింది.

మునుగోడులో టీఆరెస్ దే విజయం ‍- జనంసాక్షి ఫైనల్ సర్వే
X

తెలంగాణలో జరిగిన ఎన్నికలకు సంబంధించి 'జనంసాక్షి' పత్రిక అనేక సర్వేలు చేసింది. ఇప్పటి వరకు ఆ పత్రిక చేసిన సర్వేలు మెజార్టీ నిజమయ్యాయి. గత హుజూరాబాద్ ఎన్నికలప్పుడు కూడా సర్వే చేసిన 'జనంసాక్షి' ఈటల రాజేందర్ గెలుస్తాడని ప్రకటించింది. ఆ పత్రిక చేసిన సర్వేలకు ప్రజల్లో శాంటిటీ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో 'జనంసాక్షి' మునుగోడు ఎన్నికలపై సర్వే నిర్వహించింది ఇప్పటి వరకు ఆ పత్రిక మునుగోడులో మూడు సర్వేలను చేసింది. మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందు ఆగస్టులో మొదటి సర్వే. సెప్టంబర్ లో రెండవ‌ సర్వే చేసింది. ఇక ఈ మధ్యనే మూడవ సర్వే చేసిన 'జనంసాక్షి' ఈ రోజు ఫలితాలు ప్రకటించింది.

మూడవ సర్వే దాదాపు 15వేల మందికి పైగా ప్రజలతో చేశామని ఆ పత్రిక సంపాదకులు ఎం.ఎం.రహమాన్ తెలుగు గ్లోబల్ కు తెలిపారు. బ్యాలెట్ పేపర్ల‌ ద్వారా ఈ సర్వే జరిగింది. అనేక రూరల్ , అర్బన్ ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు వేయించడం ద్వారా శాస్త్రీయ పద్దతిలో ఈ సర్వే నిర్వహించారు. 300 మంది 'జనంసాక్షి' ప్రతినిధులు 7 మండలాల్లో ఈ సర్వేను చేశారు.

మునుగోడు, చండూరు, మర్రిగూడ, సంస్థాన్ నారాయణ్ పూర్, నాంపల్లి, చౌటుప్పల్, గ‌ట్టుప్పల్ మండ‌లాల్లోని రూరల్, అర్బన్ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సర్వే వివరాలను 'జనంసాక్షి' ఎడిటర్ రహమాన్ ఈ రోజు ప్రకటించారు.

'జనంసాక్షి' సర్వే జరిపిన మూడు సర్వేల్లోనూ 2, 3 శాతాలు అటు ఇటు ఉన్నప్పటికీ ఒకే విధమైన రిపోర్ట్ వచ్చింది.

'జనంసాక్షి' ఫైనల్ సర్వే ప్రకారం...

టీఆరెస్ కు 45‍ - 52 శాతం

బీజేపీకి 29-34 శాతం

కాంగ్రెస్ కు 16-18 శాతం

బీఎస్పీకి 4 ‍- 5 శాతం ఓట్లు రానున్నాయి.

టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రబాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్తి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 15 శాతానికి పైగా ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్టు 'జనంసాక్షి' సర్వే తేల్చింది. అంటే దాదాపు 30 వేలకు పైగా మెజార్టీ కూసుకుంట్ల ప్రబాకర్ రెడ్డికి రాబోతుందని జనంసాక్షి సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మూడ‌వ స్థానంలో ఉండబోతున్నారు.

ఇంకా లోతుల్లోకి వెళ్తే ...చండూరు, మర్రి గూడెం అర్బన్ లో టీఆరెస్ కు బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది. అయితే ఈ రెండు మండలాల్లోని రూరల్ ప్రాంతాల్లో మాత్రం టీఆరెస్ దే పైచేయిగా ఉంది. ఇక మునుగోడు, సంస్థాన్ నారాయణ్ పూర్, నాంపల్లి, చౌటుప్పల్, గ‌ట్టుప్పల్ మండలాల్లోని మెజార్టీ ఓటర్లు కారు గుర్తుకే జై కొడుతున్నారు.

ప్రధానంగా 'జనంసాక్షి' ప్రతినిధులు ఓట‌ర్ల ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు వాళ్ళు వెల్లడించిన అభిప్రాయాలు చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయని 'జనంసాక్షి' ఎడిటర్ తెలుగు గ్లోబల్ తో చెప్పారు. టీఆరెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, ముఖ్యంగా వృద్దులకు, ఒంటరి మహిళలకు పెన్షన్, రైతు బంధు,రైతులకు 24 గంటల‌ ఉచిత విద్యుత్తు, దళిత బంధు పథకాల పట్ల ఓటర్లు చాలా ఆసక్తి ప్రదర్శించారని చెప్పారు. అదే విధంగా ఫ్లోరైడ్ సమస్య తీరినందుకు అన్ని గ్రామాల ప్రజలు ఆనందంగా ఉన్నారని, అందులో మెజార్టీ ప్రజలు కేసీఆర్ పట్ల అభిమానంతో ఉన్నారని 'జనంసాక్షి' ఎడిటర్ చెప్పారు.

రహమాన్ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే... అక్కడ బీజేపీకి 29-34 శాతం ఓట్లు వచ్చేంత నిర్మాణం కానీ, ప్రభావం కానీ లేదని, అయితే ఆ ఓట్లు మొత్తం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా సంపాదించుకునే ఓట్లేనని ఆయన చెప్పారు. చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లు రాజగోపాల్ వైపు మళ్ళడం వల్ల ఆయన ఓట్ల శాతం పెరిగిందని రహమాన్ చెప్పారు. అంతే కాదు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 18 వేల కోట్ల కాంట్రాక్ట్ పై టీఆరెస్ చేసిన ప్రచారం గ్రామస్థాయి వరకు వెళ్ళిపోయిందని, దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారని రహమాన్ చెప్పారు.

First Published:  25 Oct 2022 9:21 PM IST
Next Story