జనగామ లైన్ క్లియర్.. సయోధ్య కుదిర్చిన కేటీఆర్
జనగామ టికెట్ పల్లాకు ఖాయమవుతుందని కొన్నిరోజులుగా ఊహాగానాలు వినిపించినా.. ఈ రోజు అది ఖాయమని తేలిపోయింది. మంత్రి కేటీఆర్ స్వయంగా పల్లా పేరు ప్రకటించేశారు. మిగిలిన ఆశావహుల్ని కూడా ఆయన బుజ్జగించారు.
ఎట్టకేలకు జనగామ పంచాయితీ పూర్తయింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు మంత్రి కేటీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. పల్లాకు సపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఇద్దరు నాయకుల మధ్య కేటీఆర్ సమక్షంలో సయోధ్య కుదిరింది. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో జనగామ ఆశావహులందర్నీ పిలిపించి మాట్లాడారు మంత్రి కేటీఆర్. టికెట్ పల్లాకు ఖాయం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పల్లాను గెలిపించాలని జనగామ నేతలకు సూచించారు.
బీఆర్ఎస్ తొలి జాబితాలో చోటు దక్కని నియోజకవర్గాల్లో జనగామ కూడా ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మరోసారి టికెట్ ఖరారు కాకపోవడంతో ఆయన అలకబూనారు. అయితే అవకాశం ఎక్కడికీ పోలేదని అనుచరులకు సర్దిచెబుతూ వచ్చారు. తీరా ఆయన్ను ఆర్టీసీ చైర్మన్ గా నియమించే సరికి జనగాన ఎమ్మెల్యే టికెట్ రాదని క్లారిటీ వచ్చేసింది. అయినా కూడా తానే బరిలో ఉంటానంటూ చెబుతున్నారు ముత్తిరెడ్డి. చివరకు ఈ పంచాయితీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ముత్తిరెడ్డితోపాటు, జనగామ టికెట్ ఆశిస్తున్న మండల శ్రీరాములు, కిరణ్ కుమార్ గౌడ్ ని కూడా పిలిపించి మాట్లాడారు కేటీఆర్. ఈసారి టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు.
జనగామ టికెట్ పల్లాకు ఖాయమవుతుందని కొన్నిరోజులుగా ఊహాగానాలు వినిపించినా.. ఈ రోజు అది ఖాయమని తేలిపోయింది. మంత్రి కేటీఆర్ స్వయంగా పల్లా పేరు ప్రకటించేశారు. మిగిలిన ఆశావహుల్ని కూడా ఆయన బుజ్జగించారు. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగినట్టే తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకూ టికెట్ తనకే ఖాయమని చెబుతున్న ముత్తిరెడ్డి కూడా ఈ రోజు కేటీఆర్ ముందు సైలెంట్ గా ఉన్నారు. పల్లాకే మద్దతిస్తానని ఆయనకు మాటిచ్చారు.
♦