బీజేపీ కాదంటేనే కొత్త పొత్తు- పవన్ కల్యాణ్
మరో వారంలో ఎన్నికలు అన్నప్పుడే పొత్తులపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. అప్పటి వరకు అన్ని పార్టీల్లో పొత్తులపై తర్జనభర్జన సహజమన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు చేయించిన పవన్ కల్యాణ్ అక్కడే మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతానన్నది చెప్పలేనన్నారు. తన ప్రభావం తెలంగాణలో ఎంత ఉంటుందన్నది కాలమే తేల్చాలన్నారు. కన్నా లక్ష్మీనారాయణ అంటే తమకు అపారమైన గౌరవమని.. బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతారా లేదా అన్న దానిపై మాట్లాడటం సరికాదన్నారు.
బీజేపీతో పొత్తు కొనసాగుతుందని అందులో సందేహం లేదన్నారు. 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందా లేదా అన్నది కాలమే తేలుస్తుందన్నారు. కొత్త కొత్త నాయకులు ముందుకు రావడం మంచిపరిణామం అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్‌ను వెళ్లడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ముందు రాష్ట్ర ప్రభుత్వాల తీరు బలంగా ఉంటే దావోసుకు వెళ్లినా ఫలితం ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం తీరు ఆరంభశూరత్వం మాత్రమేనన్నారు.
మరో వారంలో ఎన్నికలు అన్నప్పుడే పొత్తులపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. అప్పటి వరకు అన్ని పార్టీల్లో పొత్తులపై తర్జనభర్జన సహజమన్నారు. ఓట్లు చీలకూడదన్నదే తమ అభిప్రాయం అన్నారు. కానీ, తాను అనుకుంటున్నట్టుగా అన్ని పార్టీలు కలిసి రావాలని ఏమీ లేదన్నారు. బీజేపీతో ప్రస్తుతం పొత్తుతో ఉన్నాం కాబట్టి కలిసి వెళ్తాం.. బీజేపీ కాదంటే ఒంటరిగా వెళ్తాం లేదా కొత్త పొత్తులు పెట్టుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీకి 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే ఇలా ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు జీవోలు ఇచ్చే వారు కాదన్నారు పవన్ కల్యాణ్.