ఖమ్మంలో మరో జంపింగ్.. కాంగ్రెస్ గూటికి జలగం
కొత్తగూడెం టికెట్ హామీతోనే జలగం, కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి జలగం వెంకట్రావు ఢిల్లీ చేరుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఫిరాయింపులు సహజంగా మారాయి. ఒకరు ప్లస్ అనుకునేలోపు ఇంకొకరు మైనస్ అవుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ కండువాల మార్పిడి జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తాజాగా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కొత్తగూడెం టికెట్ ఇవ్వలేదన్న అలకతో ఆయన బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. అదే టికెట్ హామీతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారు.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు జలగం వెంకట్రావు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ వైపు రావడంతో అక్కడ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఇటీవల వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో జలగం మళ్లీ హుషారయ్యారు. ఆ తీర్పుని వనమా సుప్రీంలో సవాల్ చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో.. కొత్తగూడెం నియోజకవర్గ టికెట్ విషయంలో బీఆర్ఎస్.. వనమా వైపే మొగ్గు చూపడంతో జలగం అలకబూనారు. కొన్నిరోజులుగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు.
కొత్తగూడెం టికెట్ హామీతోనే జలగం, కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి జలగం వెంకట్రావు ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో జలగం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.