Telugu Global
Telangana

కేసీఆర్ నిర్ణయంతో అగమ్యగోచరంగా జలగం రాజకీయ భవిష్యత్.!

వచ్చేసారి తానే టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉంటానని వనమా వెంక‌టేశ్వ‌ర‌రావు స్వయంగా ప్రకటించుకున్నారు. దానికి కూడా సిట్టింగులకే టికెట్ కేటాయిస్తామని సీఎం కేసీఆర్ కూడా చెప్పడంతో.. వెంకట్రావు పరిస్థితి సందిగ్దంలో పడింది.

కేసీఆర్ నిర్ణయంతో అగమ్యగోచరంగా జలగం రాజకీయ భవిష్యత్.!
X

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు రాజకీయ భవిష్యత్ ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లు కేటాయిస్తామని కేసీఆర్ సూచనప్రాయంగా చెప్పడంతో ఈసారి వెంకట్రావు టికెట్ గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. తండ్రి వెంగళరావు, సోదరుడు ప్రసాదరావు స్పూర్తితో వెంకట్రావు 2004లో రాజకీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేశారు. ఆ ఏడాది కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం, వైఎస్ఆర్ పాదయాత్ర ప్రభావంతో సత్తుపల్లి నుంచి వెంక‌ట్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. స్వతహాగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవడం మాత్రమే కాకుండా, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ అయిన వెంకట్రావు.. ప్రజల్లోకి చొచ్చుకొని పోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. అయితే 2009లో సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీ కోటాలోకి మారిపోయింది.

2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ రాజకీయ నాయకులు నియోజకవర్గాలు మారాల్సి వచ్చింది. ఈ క్రమంలో వెంకట్రావు కొత్తగూడెం సెగ్మెంట్‌పై దృష్టి పెట్టారు. కానీ అప్పటికే అక్కడ వనమా వెంకటేశ్వరావు కాంగ్రెస్ తరపున బలమైన నాయకుడిగా ఉన్నారు. దీంతో వెంకట్రావుకు ఏ పార్టీ నుంచి కూడా టికెట్ దక్కలేదు. అయితే, వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను వీడి వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీలోకి వెళ్లడానికి జలగం వెంకట్రావు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగతుండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా, 2014లో టీఆర్ఎస్ పార్టీ ఆయనకు కొత్తగూడెం నుంచి టికెట్ కేటాయించింది.

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అయిన ఏకైక వ్యక్తి జలగం వెంకట్రావు. దీంతో కొత్తగూడెం నుంచే వెంకట్రావు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. టీఆర్ఎస్ పార్టీని కొత్తగూడెంలో బలోపేతం చేయడానికి కృషి చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో సైతం వెంకట్రావుకే టీఆర్ఎస్ టికెట్ కేటాయించారు. అయితే కాంగ్రెస్ తరపున బరిలో దిగిన వనమా వెంకటేశ్వరావు ఎన్నికల్లో గెలిచారు. మహాకూటమిలో భాగంగా టికెట్ దక్కడంతో లెఫ్ట్ పార్టీలతో పాటు టీడీపీ మద్దతు కూడా వనమాకు కలిసి వచ్చింది. కాగా, ఆ తర్వాత వనమా వెంకటేశ్వరావు టీఆర్ఎస్‌లో చేరడంతో వెంకట్రావుకు సెగ మొదలైంది.

అప్పటి వరకు టీఆర్ఎస్‌కు వెంకట్రావు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ సీనియర్ నేత వనమా వెంకటేశ్వరావు టీఆర్ఎస్‌లో చేరారో.. వెంకట్రావుకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అంతే కాకుండా నియోజకవర్గంలో వనమా కూమారుడు వనమా రాఘవ పెత్తనం కూడా పెరిగిపోయింది. అయితే, 2023లో టికెట్ తనకు దక్కుతుందని వెంకట్రావు తన పని తాను చేసుకొని పోయారు. కానీ, నియోజకవర్గంలో వనమా ప్రభావం పూర్తిగా పెరిగింది. ఇటీవల రాఘవ ఉదంతం తర్వాత వనమాకు టికెట్ దక్కక పోవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, వచ్చేసారి తానే టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉంటానని వనమా వెంక‌టేశ్వ‌ర‌రావు స్వయంగా ప్రకటించుకున్నారు. దానికి కూడా సిట్టింగులకే టికెట్ కేటాయిస్తామని సీఎం కేసీఆర్ కూడా చెప్పడంతో.. వెంకట్రావు పరిస్థితి సందిగ్దంలో పడింది.

వెంకట్రావుకు టికెట్ దక్కకపోతే కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి పోటీ చేస్తారా? లేదంటే.. వనమా రాఘవపై వస్తున్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి వెంకట్రావుకే కేసీఆర్ టికెట్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి వెంకట్రావు ఈ విషయంలో మౌనం పాటిస్తున్నా.. వచ్చే సారి కచ్చితంగా తనకు టికెట్ వస్తుందని సన్నిహితులతో చెబుతున్నారు. వనమా ఫ్యామిలీపై ఉన్న ఆరోపణల వల్ల వారికి టికెట్ దక్కదని.. అందుకే తమ పని తాము చేసుకొని పోదామని అనుచరులతో అంటున్నట్లు తెలుస్తున్నది.

First Published:  12 Sept 2022 6:45 AM GMT
Next Story