పార్టీ మారను, మారను, మారను.. ఇంకెన్నిసార్లు చెప్పాలి..?
పదే పదే పార్టీ మారను అని చెప్పుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అయితే ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుంది, పదే పదే ఇలాంటి వివరణ ఇస్తున్నారంటే అసలు ఆయన మనసులో ఇంకేదో ఉందనే అనుమానం కూడా వస్తుంది. ప్రస్తుతం జగ్గారెడ్డి పరిస్థితి అలాగే ఉంది.
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి ఓ విచిత్రమైన సమస్య ఎదురైంది..? కావాలనే ఆయన ఆ సమస్య జోలికి వెళ్లారా..? లేక నిజంగానే ఆయన ఇబ్బంది పడుతున్నారా..? అనేది మాత్రం అర్థం కావడంలేదు. రోజూ ప్రెస్ మీట్ పెట్టడం, తాను పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చుకోవడం. ఇదే ఆయన దినచర్యగా మారింది. జగ్గారెడ్డి ప్రెస్ మీట్ అంటే.. కచ్చితంగా పార్టీ మారడంలేదు అని చెబుతారనే చర్చ మీడియాలో జరుగుతోంది. ఇంతకీ జగ్గారెడ్డికి ఎందుకీ అవస్థ..? అసలు ఆయన్ను ఎవరు టార్గెట్ చేశారు..?
"పార్టీ మారడం లేదని నిన్ననే క్లారిటీ ఇచ్చా. మీడియా సమావేశం పెట్టా. ఇంకా పుకార్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ గుసగుసలు ఇప్పటికైనా బంద్ కావాలి. మళ్లీ చెప్తున్నా, పార్టీ మారే ఉద్దేశం లేదు. నా గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తే.. పార్టీలో ఫిర్యాదు చేస్తా. పరువునష్టం దావా వేస్తా. లీగల్ నోటీసు ఇస్తా. అయినా మారకపోతే నా అనుచరులకి అప్పగిస్తా." అంటూ నిన్న మరోసారి చెప్పుకొచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సొంత పార్టీ నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు.
వదిలేస్తే పోలా..?
పదే పదే పార్టీ మారను అని చెప్పుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అయితే ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుంది, పదే పదే ఇలాంటి వివరణ ఇస్తున్నారంటే అసలు ఆయన మనసులో ఇంకేదో ఉందనే అనుమానం కూడా వస్తుంది. ప్రస్తుతం జగ్గారెడ్డి పరిస్థితి అలాగే ఉంది. అందులోనూ ఆయన వైరి వర్గం ఓ ప్లాన్ ప్రకారమే సోషల్ మీడియాలో ఆయన్ను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జగ్గారెడ్డికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని అసలు మీడియాలో ఖండిస్తూ తన బాధ బయటపెట్టుకుంటున్నారు. ఈసారి మాత్రం పోలీస్ కేసులు పెడతా, పరువు నష్టం దావా వేస్తా అంటూ ఇంకాస్త ఘాటుగా జగ్గారెడ్డి హెచ్చరించడం విశేషం.
♦