పార్టీ గెలిచింది, నేను ఓడిపోయా.. జగ్గారెడ్డి బాధ వర్ణనాతీతం
ఎన్నికలైపోయి నెలలు గడుస్తున్నా జగ్గారెడ్డి మాత్రం ఇంకా ఆ ఓటమి బాధనుంచి తేరుకోలేదనే విషయం అర్థమవుతోంది. అందుకే పదే పదే తన నియోజకవర్గ ప్రజలు తప్పు చేశారని అంటున్నారు జగ్గారెడ్డి.
2018 ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గెలిచినా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలవలేదు. తాను ఓడిపోవడం కంటే.. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో ఓటమి ఆయన్ను మరింతగా బాధపెడుతోంది. ఇటీవల నియోజకవర్గ ప్రజలపై ఇదే విషయంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఆయన తన బాధ బయటపెడ్డారు. ఈసారి గ్యారెంటీగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తాను పదే పదే నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని లబోదిబోమంటున్నారు జగ్గారెడ్డి. ఏమొహం పెట్టుకుని తాను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి నిధులు అడగాలని ప్రశ్నిస్తున్నారు.
ఒక వేళ తాను గెలిచి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సంగారెడ్డి అభివృద్ధికోసం నిధులు కావాల్సినంత అడిగేవాడినని అన్నారు జగ్గారెడ్డి. ఎమ్మెల్యేగా గెలవలేదు కాబట్టి.. ఇప్పుడు తనకు అంత చొరవ ఉండదన్నారు. నియోజకవర్గంలో తనకు ఓటు వేసిన 75వేల మందికి తానెప్పుడూ జవాబు దారిగానే ఉంటానని తెలిపారు జగ్గారెడ్డి. అయితే తనకు ఓటు వేయని 80 వేల మంది ఓసారి ఆలోచన చేయాలని అన్నారు. వారు కూడా తనకు ఓటు వేసి గెలిపించి ఉంటే ఇప్పుడీ అవస్థలు ఉండేవి కావన్నారు జగ్గారెడ్డి.
తానెప్పుడూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనులు చేయలేదని, ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా నిలిచానన్నారు జగ్గారెడ్డి. తన నియోజకవర్గంలో ప్రతి పండగను గొప్పగా నిర్వహించానన్నారు. కానీ ఎక్కడో తప్పు జరిగిందని, కొంతమంది తనకు ఓటు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ తాను వారికి చెబుతూనే ఉన్నానని, కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందన్నారాయన. ఎన్నికలైపోయి నెలలు గడుస్తున్నా జగ్గారెడ్డి మాత్రం ఇంకా ఆ ఓటమి బాధనుంచి తేరుకోలేదనే విషయం అర్థమవుతోంది. అందుకే పదే పదే తన నియోజకవర్గ ప్రజలు తప్పు చేశారని అంటున్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు తనను గెలిపించిన ఓటర్లు, పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఓడించినందుకు ఆయన మరింత ఎక్కువగా బాధపడుతున్నారు.