Telugu Global
Telangana

హైదరాబాద్‌పై కన్నేసిన అంతర్జాతీయ బయోటెక్, లైఫ్ సైన్సెస్ సంస్థలు

విశ్వనగరమైన హైదరాబాద్ ఫార్మా, ఐటీ రంగాలకు హబ్‌లా మారింది. ఈ క్రమంలో దాదాపు డజనుకు పైగా పెద్ద సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ సంస్థల విస్తరణను చేపట్టాలని నిర్ణయించాయి.

హైదరాబాద్‌పై కన్నేసిన అంతర్జాతీయ బయోటెక్, లైఫ్ సైన్సెస్ సంస్థలు
X

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారీ బయోటెక్, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు అత్యంత వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ కొత్త గమ్య స్థానంలా మారుతోంది. విశ్వనగరమైన హైదరాబాద్ ఫార్మా, ఐటీ రంగాలకు హబ్‌లా మారింది. ఈ క్రమంలో దాదాపు డజనుకు పైగా పెద్ద సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ సంస్థల విస్తరణను చేపట్టాలని నిర్ణయించాయి. ఇప్పటికే బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఉన్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు.. తమ భారీ పెట్టుబడులను హైదరాబాద్‌కు తరలించడానికి నిర్ణయించుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బెంగళూరు కేంద్రంగా ఉన్న సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రెండేళ్ల క్రితమే హైదరాబాద్‌లో అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పింది. త్వరలోనే జీనోమ్ వ్యాలీలో భారీ విస్తరణకు సిద్ధపడుతోంది. అక్కడ కొత్త ఫెసిలిటీస్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఈ కొత్త ఫెసిలిటీ కోసం సింజీన్ సంస్థ రూ.167 కోట్ల పెట్టుబడి పెడుతున్నది. బెంగళూరు అవతల సింజీన్‌కు ఇదే మొదటి రీసెర్చ్ సెంటర్ కానున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుంచి ఇప్పటి వరకు లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణలో మంచి క్రియాశీల ప్రభుత్వం ఉంది. ఇక్కడి మెరుగైన ఇండస్ట్రియల్ పాలసీలు, అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయి. అందుకే తమ కంపెనీని హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఒక ఫార్మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. తెలంగాణ కంటే ముందు మూడు, నాలుగు రాష్ట్రాలను పరిశీలించాము. కానీ హైదరాబాద్ మా బెస్ట్ ఛాయిస్ అని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

జీనోమ్ వ్యాలీ వెలుపల తుర్కపల్లి, షామీర్‌పేట్, మేడ్చల్, ఉప్పల్, పటాన్‌చెరు, జీడిమెట్ల, గచ్చిబౌలి, కీసర వంటి ప్రాంతాల్లో 200కి పైగా సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌లో యూనిట్లు నెలకొల్పడానికి భూముల కోసం భారీ డిమాండ్ ఉన్నది. ఇంగ్లాండ్‌కు చెందిన క్రోడా ఇంటర్నేషనల్ అనే సంస్థకు ప్రస్తుతం ముంబైలో ఒక యూనిట్ ఉంది. అయితే అక్కడ విస్తరణకు ఆటంకాలు ఉండటంతో హైదరాబాద్‌ను ఎంచుకున్నది. త్వరలోనే నగర కేంద్రంగా కొత్త గ్లోబల్ టెక్నికల్ సెంటర్ నెలకొల్పనున్నది.

కెనడాకు చెందిన జేఏఎంపీ ఫార్మాకు అహ్మదాబాద్‌లో ఒక యూనిట్ ఉన్నది. తాజాగా ఈ సంస్థ హైదరాబాద్‌లో భారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నది. అలాగే జర్మనీ, నెదర్లాండ్‌లో పని చేస్తున్న డీఎఫ్ఈ ఫార్మా కంపెనీ ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో భారీ యూనిట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన యూరోఫిన్స్ సైంటిఫిక్ అనే కంపెనీకి లక్సెంబర్గ్‌లో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇండియాలో తమ తొలి యూనిట్ బెంగళూరులో నెలకొల్పగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.1,000 కోట్లతో విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది.

అందరి చాయిస్ హైదరాబాద్..

లైఫ్ సైన్సెస్, ఫార్మ, బయోటెక్ సంస్థలు తమ తొలి ఛాయిస్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. ఆయా రంగాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం కావడంతో హైదరాబాద్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ ఫార్మ సిటీ డైరెక్టర్, సీఈవో శక్తి నాగప్పన్ తెలిపారు. హైదరాబాద్‌లో అసాధారణమైన టాలెంట్ కలిగిన ఎకో సిస్టమ్ ఉన్నది. ఇక్కడ కెమిస్ట్రీ, బయాలజీ, జెనిటిక్స్, టెక్నాలజీ, ఇతర రంగాలకు చెందిన ఎంతో మంది స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారని నాగప్ప తెలిపారు.

నెదర్లాండ్స్, కెనడా, యూకే, జపాన్, స్విట్జర్లాండ్‌కు చెందిన అనేక సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా తమ యూనిట్లు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన చెప్పారు. దాదాపు 13 కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్తగా యూనిట్లు ప్రారంభించనున్నాయని అన్నారు. 2018 నుంచి లైఫ్ సైన్సెస్ రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

First Published:  30 July 2023 5:32 AM GMT
Next Story