Telugu Global
Telangana

పాపం బీజేపీ.. అధిష్టానం హిందీలో పంపే సందేశాలు అర్థం కాక నాయకుల కంగారు!

బీజేపీ అధిష్టానం తెలంగాణ నాయకులకు ఎస్ఎంఎస్, వాట్సప్, మెయిల్, ఇతర మాధ్యమాల ద్వారా పంపే సందేశాలన్నీ హిందీలో ఉండటంతో గందరగోళం నెలకొంటున్నట్లు సమాచారం.

పాపం బీజేపీ.. అధిష్టానం హిందీలో పంపే సందేశాలు అర్థం కాక నాయకుల కంగారు!
X

ఎప్పుడైనా బీజేపీలో ఉండే వారి పదవుల పేర్లు గమనించారా? ప్రభారి, విస్తారక్, పాలక్, సశక్తికరన్.. ఇలా ఉంటాయి పేర్లు. ఉత్తరాది పార్టీ.. పైగా హిందీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కావడంతో పదవుల పేర్లన్నీ ఇలా హిందీలో పెట్టుకున్నది. ఇప్పుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడిన బీజేపీ.. ఇక్కడ కూడా పదవులను హిందీలోనే పలుకుతోంది. అధికారికంగా ఢిల్లీ నుంచి పంపే సందేశాలు కూడా పూర్తిగా హిందీలోనే ఉంటున్నాయి. దీంతో రాష్ట్ర నాయకులకు అర్థం కాక తల పట్టుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

బీజేపీ అధిష్టానం తెలంగాణ నాయకులకు ఎస్ఎంఎస్, వాట్సప్, మెయిల్, ఇతర మాధ్యమాల ద్వారా పంపే సందేశాలన్నీ హిందీలో ఉండటంతో గందరగోళం నెలకొంటున్నట్లు సమాచారం. ఇక్కడి నాయకులకు చాలా మందికి హిందీ అర్థం అయినా.. చదవడం మాత్రం రాదు. హైదరాబాద్, మహారాష్ట్ర సరిహద్దులో ఉండే జిల్లాల నాయకులకు హిందీ అర్థం అవుతుంది. కొంత మంది చదవగలరు. అయితే దాన్ని పూర్తిగా తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి కింది స్థాయి నాయకులకు పంపడం కష్టమవుతోందని వాపోతున్నారు.

ముఖ్యంగా పదవులను సక్తికరన్, విస్తారక్, పాలక్ అని పిలుస్తుండటంతో వాటిని ఇంగ్లీషులో, తెలుగులో ఏమంటారో తెలియక నెత్తి బాదుకుంటున్నారు. ఇటీవల అధిష్టానం రాష్ట్ర నాయకులకు ఒక సందేశం పంపింది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 'సశక్తికరన్‌'లను బలోపేతం చేయాలని రాసుంది. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్, దూకుడు మీద ఉన్న కాంగ్రెస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే 'సశక్తికరన్'లను బలోపేతం చేయాలని సందేశంలో పేర్కొంది. అయితే అసలు ఈ పదానికి అర్థం తెలియక.. దాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయలేక కంగారుపడినట్లు తెలిసింది.

ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సీనియర్ నాయకుడికి ఈ సందేశం రావడంతో.. ఏం చేయాలో తెలియక బీజేపీలోకి కీలక నాయకుడికి ఫోన్ చేసి కనుక్కున్నారు. 'సశక్తికరన్' అంటే బూత్ లెవెల్ కార్యకర్త అని చెప్పడంతో ముక్కున వేలేసుకున్నాడట. మాకు పంపే సందేశాలు హిందీలో కాకుండా కనీసం ఇంగ్లీషులో అయినా పంపమని కోరాడట. అయితే కేంద్ర కార్యాలయం నుంచి అన్ని సందేశాలు హిందీలోనే వస్తాయని.. దాన్ని ట్రాన్స్‌లేట్ చేసే యంత్రాంగం హైదరాబాద్‌లో లేదని చెప్పినట్లు సమాచారం.

ప్రజలకు కూడా అర్థం కావడం లేదు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇటీవల రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. నాయకులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రజలకు దగ్గర కావాలని ఆదేశించింది. 'మహాజన్ సంపర్క్ అభియాన్' పేరుతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. దీనిపై రాష్ట్ర నాయకుల్లో అసంతృప్తి వెల్లడైనట్లు తెలుస్తున్నది. 'మహాజన్ సంపర్క్ అభియాన్' అని పేరు పెట్టి జనాల్లోకి వెళ్తే.. ప్రజలకు కూడా అర్థం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం.

అలాంటి హిందీ పేరు బదులు 'గడప గడపకు బీజేపీ' అనే పేరుతో వెళితే ప్రజలకైనా మేం ఎందుకు వచ్చామో.. ఎందుకు తిరుగుతున్నామో అర్థం అవుతుందని రాష్ట్ర నాయకులు సూచించారు. అయితే దీనిపై ఇంత వరకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. మరోవైపు ఎవరు ఎవరికి రిపోర్ట్ చేయాలని విషయం కూడా గందరగోళంగా మారింది. 'ప్రభారీ' పెద్ద పోస్టా? 'పాలక్' పెద్ద పెద్ద పోస్టా? అనే స్పష్టత కూడా లేదు. 'విస్తారక్' విధులేమిటో.. ఇంగ్లీషులో ఏమంటారో కూడా తెలియని పరిస్థితి ఉందని ఒక బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించారు.

మొత్తానికి బీజేపీ రాష్ట్ర నాయకులను ఈ హిందీ సమస్య చాలా ఇబ్బంది పెడుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంలోని నాయకుల ఇబ్బందిని గమనించి.. తెలుగు లేదా ఇంగ్లీషులో సందేశాలు పంపితే కాస్త అర్థమవుతాయని అంటున్నారు. సమయమంతా ఆ హిందీ మెసేజీలకు అర్థం చేసుకోవడానికి సరిపోతుందని.. సరైన ట్రాన్స్‌లేషన్ లేక అధిష్టానం అసలు ఏ ఉద్దేశంతో సందేశాలు పంపుతుందో కూడా అర్థం కావడం లేదని అంటున్నారు. మరి రాష్ట్ర నాయకుల హిందీ సమస్యను అధిష్టానం తీరుస్తుందో లేదో.. వేచి చూడాల్సిందే.

First Published:  26 May 2023 8:26 AM IST
Next Story