సీఎంకు ఈ సోయి ముందే ఉంటే బాగుండేది!
బీసీ కులగణన డెడికేటెడ్ కమిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై దాసోజు స్పందన
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు నేటిలోగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. డెడికేటెడ్ కమిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ సోయి ముందే ఉంటే బాగుండేది కదా! అన్నారు. స్పష్టమైన చట్టాలు ఉన్నప్పుడు కూడా డొంక తిరుగుడు నిర్ణయాలేందుకు?కోర్టు తీర్పులు, ప్రజల ఒత్తిడి ఉంటే మాత్రమే రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే పద్ధతిలోజీవో 26 విషయంలో ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్ది, నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. అదే విధంగా హైడ్రా, మూసీ ప్రాజెక్టు నిర్వాసితులను కూడా 2013 భూసేకరణ చట్టం ద్వారా పునరావాసం, ఉపాధి కల్పించి ప్రభుత్వం తన రాజ్యాంగ నిబద్ధతను చాటుకోవాలని దాసోజు సూచించారు.
రేవంత్ రెడ్డి కమిషన్ ఏర్పాటు చేయకుండా సెన్సస్ పేరుతో మోసం చేసి, బీసీల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఇటీవల విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు. రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించే రీతిలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తూ బీసీల నోట్లో మట్టి కొట్టాలనే కుట్రపూరిత ప్రయత్నం చేస్తున్నారు.కులగణనపై హైకోర్టు ఆదేశాలు అందలేదని బీసీ కమిషన్ చైర్మన్ చెప్పడం దుర్మార్గమన్నారు. రేవంత్ చెప్పుచేతల్లో బీసీ కమిషన్ పని చేస్తున్నదని ఆరోపించారు.సుప్రీంకోర్టు కూడా కులగణన మీద డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పిందని ఈ సందర్భంగా దాసోజు తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడం గమనార్హం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ల కల్పన కోసం రాజకీయంగా వెనుకబడిన వర్గాల (బీసీ) జనాభా గణాంకాల సేకరణకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిని తక్షణం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అందిన వారంలోగా నిర్ణయం ఉండాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం లోపు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు కానున్నది.
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై ఆదివారం సీఎం తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహ , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.
రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి నేడు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు ఉండవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు చెప్పారు.