ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణకు అవార్డు
తెలంగాణలో ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, అనుమతులు కానీ, పౌర సేవలు కానీ.. నిర్ణీత సమయంలో పూర్తవుతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మీసేవ కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులను ఆయన వివరించారు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ తరఫున అవార్డు అందుకున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన డిజిటల్ కాన్ క్లేవ్ లో ఆయన తెలంగాణ తరఫున పాల్గొని అవార్డు స్వీకరించారు. 'మీ సేవ' ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు గాను ఈ అవార్డు లభించింది. పురస్కారాన్ని అందించిన ఎకనమిక్ టైమ్స్ సంస్థ.. తెలంగాణ ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతోపాటు క్షేత్రస్థాయిలో ఎకనమిక్ టైమ్స్ సంస్థ ప్రతినిధులు చేపట్టిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా ఈ అవార్డుకు తెలంగాణను ఎంపిక చేసినట్టు తెలిపారు. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలుచేస్తున్న సంస్కరణలతోపాటు 'మీ సేవ' పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలు తెలంగాణలో అందుతున్నాయని చెప్పారు నిర్వాహకులు.
అనుకున్న టైమ్ కి అనుకున్నట్టుగా..
తెలంగాణలో ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, అనుమతులు కానీ, పౌర సేవలు కానీ.. నిర్ణీత సమయంలో పూర్తవుతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మీసేవ కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులను ఆయన వివరించారు. మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల, టి-వాలెట్ సాధించిన ఘనతలను కేటీఆర్ ప్రస్తావించారు. టీఎస్ ఐపాస్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో, టీఎస్ బీపాస్ లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో వ్యాపార కార్యకలాపాలకు అనుమతులను పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉందని చెప్పారు కేటీఆర్.
కేసీఆర్ నేతృత్వంలో..
ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ కృషికి నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు లభించాయని, ఎకనమిక్ టైమ్స్ ఇచ్చిన ఈ పురస్కారం దీనికి మరో నిదర్శనం అని అన్నారాయన. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విస్తృత పరిశోధన చేసినందుకు, తెలంగాణకు ఈ అవార్డు అందించినందుకు గాను, ఎకనమిక్ టైమ్స్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రంలో తెలంగాణ తరఫున మంత్రి కేటీఆర్ తోపాటు, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.