Telugu Global
Telangana

ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన మాట వాస్తవమే

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని హామీలను మాత్రమే అమలు చేశామన్నమంత్రి పొంగులేటి

ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన మాట వాస్తవమే
X

ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవమేనని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని హామీలను మాత్రమే అమలు చేశామని మంత్రి తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ. 5 లక్షల తో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటిన్‌ను, 120 కోట్లతో నిర్మించనున్న గురుకుల సమీకృత నిర్మాణ భవనానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడే నాటికే గత ప్రభుత్వంలో రాష్ట్ర అప్పు రూ. 7 లక్షల కోట్లకు ఎగబాకిందని మంత్రి మండిపడ్డారు. అసలు, మిత్తి కలిపి ప్రతి నెల రూ. 6,500 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. మొదటి ఆరు నెలల్లోనే రుణమాఫీ చేసిన ప్రభుత్వం మాది అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్‌ అన్నారు.

గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని.. చేసి చూపించాం. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లో మీడియా సమావేవంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విగ్రహంపైనా బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. ఫామ్‌ హౌస్‌లో కూర్చుని కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. కమిటీ నివేదిక ఆధారంగా ధరణి ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామన్నారు. రైతులకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తామన్నారు. తిరస్కరించిన ప్రతి ఫిర్యాదు ఎందుకు చేశారో కారణం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ధరణిలో కొన్ని మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు.

ధరణి కొత్త యాప్‌, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసింది. రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకున్నారు. 2004-14 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించిందని మంత్రి తెలిపారు. 2014-2023 వరకు 1.52 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు టెండర్లు పిలిచారని చెప్పారు. మొన్నటి వరకు కల్లాల బాట పట్టారని, అది మధ్యలో ఆపేసి ఇప్పుడు గురుకుల పాఠశాలల బాట పట్టారని విమర్శించారు. ప్రస్తుతం గురకుల పాఠశాలల్లో ఉన్న పరిస్థితులకు కారణం బీఆర్‌ఎస్సే అని ధ్వజమెత్తారు. మాది తుగ్లక్‌ పాలన అంటున్నారని, అసలు తుగ్గక్‌ పాలన ఫామ్‌ హౌస్‌ పాలనేనని విమర్శించారు. త్వరలోనే సర్వే వ్యవస్థను కూడా పటిష్టం చేస్తామని, దీనికోసం 100 సర్వేయర్ల పోస్టులను భర్తీ చేస్తామని పొంగులేటి తెలిపారు.

First Published:  8 Dec 2024 2:29 PM IST
Next Story