యూపీఎస్సీ పరీక్ష పాస్ అవడం కంటే కష్టమైంది అదే.. మంత్రి కేటీఆర్
ప్రపంచ దేశాలు రుణాలను భవిష్యత్‌కు పెట్టుబడిగా చూస్తున్నాయి. ఇండియాలో మాత్రమే రుణాల విషయంలో చాలా అపోహలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు సవాళ్లతో కూడుకున్నవి. ప్రభుత్వ పాలనకు వినూత్న ఆలోచనలు, పాలసీలు చాలా అవసరం. పాలకుడికి విజన్ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం గొప్పగా పని చేస్తుంది. రాజకీయాలను వృత్తిగా ఎంచుకునే అంశం కూడా ఎంతో సవాళ్లతో కూడుకున్నదే. ప్రజా క్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం అంటే.. యూపీఎస్సీ పరీక్ష రాసి పాస్ అయిన దాని కంటే కఠినమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. పంజాబ్‌లోని ఐఎస్‌బీ క్యాంపస్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు 8వ బ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
ప్రపంచ దేశాలు రుణాలను భవిష్యత్‌కు పెట్టుబడిగా చూస్తున్నాయి. ఇండియాలో మాత్రమే రుణాల విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. అభివృద్ధి పనుల కోసం రుణాలు తీసుకోకుండా ఉండాలనే పాత కాలపు ధోరణితో.. దేశం ముందుకు వెళ్లకుండా వెనకబడుతోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లో ఆదర్శ విధానాలు నేర్చుకునేందుకు కేంద్రం చొరవ చూపాలని కేటీఆర్ అన్నారు. శాంతి భద్రతలను కాపాడటం భవిష్యత్‌లో అన్ని ప్రభుత్వాలకు క్లిష్టమైన సవాలే అని కేటీఆర్ పేర్కొన్నారు.
యువత ఉద్యోగాలు సాధించగానే.. రుణాలు తీసుకొని తమ జీవితాలను బాగు చేసుకుంటున్నారు. ఇదే తరహాలో దేశాలు కూడా మౌలిక వసతుల కోసం అవసరమైతే అప్పులు తీసుకొని భవిష్యత్ పెట్టుబడిగా భావించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం వినూత్న విధానాలు దేశానికి చాలా అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను అతి తక్కువ సమయంలోనే తెలంగాణ సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో అధిక శాతం తెలంగాణలోనే తయారవుతున్నాయి. త్వరలోనే సగం వ్యాక్సిన్లను తెలంగాణే ఉత్పత్తి చేయబోతోందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రపంచమంతా నిర్మాణ రంగంలో వేగంగా పని తీరు చూపించే చైనా మోడల్ గురించి మాట్లాడతారు. కానీ అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.
రూ.లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సాయం అందలేదని కేటీఆర్ వివరించారు. తెలంగాణ గత దశాబ్దంలో సాధించిన ప్రగతి తరహాలో.. ఇతర రాష్ట్రాలు కూడా ముందుకు వెళ్లి ఉంటే.. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా ఒకటిగా మారేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులకు విజన్ గొప్పగా ఉంటే.. ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే స్పూర్తితో పని చేస్తుందని చెప్పారు.
IT and Industries Minister @KTRBRS speaking at the launch of @ISBedu’s 8th batch of the Advanced Management Programme in Public Policy (AMPPP) at Mohali https://t.co/Ly2MQkTz55
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 11, 2023