Telugu Global
Telangana

రాష్ట్ర చరిత్రలో ఇది ఉజ్వలమైన రోజు.. మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. మనం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాము. ఇక ఇప్పుడు డాక్టర్లను కూడా అందించే స్థాయికి ఎదగబోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.

రాష్ట్ర చరిత్రలో ఇది ఉజ్వలమైన రోజు.. మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
X

వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. ఇది మన రాష్ట్ర చరిత్రలోనే ఉజ్వలమైన రోజు. ఇకపై మన రాష్ట్రం ఏడాదికి 10 వేల మంది వైద్యులను సృష్టించబోతోందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ శుక్రవారం ఒకే సారి వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాలకు చెందిన మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

రాష్ట్రంలో ఈ రోజు ప్రారంభించిన కాలేజీలతో రాష్ట్ర వ్యాప్తంగా 26 కాలేజీలు మొదలయ్యాయి. ఇక మిగిలిన 8 కాలేజీలు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు అవుతాయి. ఇందుకు అవసరం అయిన అన్ని చర్యలను వైద్యారోగ్య శాఖ తీసుకుంటోందని సీఎం కేసీఆర్ చెప్పారు. మన శరీరంలోని రక్తంలో ఉండే తెల్ల రక్తకణాలు ఏ విధంగా అయితే రోగ నిరోధక శక్తిని పెంచుతాయో.. తెల్లకోటు ధరించే డాక్టర్లు కూడా మన సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కృషి చేస్తారు. తెలంగాణలో ఇన్ని కాలేజీలు ఒకే రోజు ప్రారంభం అవుతుంటే నాకు ఆత్మ సంతృప్తి కలుగుతోంది. ఒక నాడు పరిపాలనే చేతకాదు అన్నారు. కానీ ఇవ్వాళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఇకపై ఏడాదికి 10 వేల మంది డాక్టర్లను దేశానికి అందించబోతున్నది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో నీట్ కోటా పోగా..మిగిలినవి అన్ని సీట్లు మన విద్యార్థులకే లభించేలా జీవో జారీ చేశాము. కోర్టులో కూడా దీనిపై మన వైద్యారోగ్య శాఖ గట్టిగా పోరాటం చేసి గెలిచిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. మనం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాము. ఇక ఇప్పుడు డాక్టర్లను కూడా అందించే స్థాయికి ఎదగబోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.

కరోనా లాంటి వైరస్‌లు భవిష్యత్‌లో మరిన్ని వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. అలాంటి మహమ్మారిలను ఎదుర్కోవాలంటే మామూలు ఆసుపత్రులు సరిపోవు. అందుకే ముందుగా ఆలోచించి వైద్య కళాశాలలు, అనుబంధంగా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వైద్యారోగ్య శాఖను పటిష్టం చేయడంలో భాగంగానే ఇన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే.. వాటికి అనుబంధంగా 34 అద్బుతమైన ఆసుపత్రులు ఉన్నాయని అర్థమన్నారు.

తెలంగాణలో ఇప్పుడు ప్రతీ లక్ష మందికి 25 మెడికల్ సీట్లు ఉన్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవని చెప్పారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రారంభం అవుతున్న కొత్త మెడికల్ సీట్లలో 43 శాతం తెలంగాణవే అన్నారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని భావిస్తోందని అన్నారు. తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తోందని అనడానికి ఇది మరో నిదర్శనం అని చెప్పారు.

తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో 17 వేల బెడ్లు అందుబాటులో ఉంటే.. ఇప్పుడు 34 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. వరంగల్ హెల్త్ సిటీ, నగరంలోని నాలుగు టిమ్స్, నిమ్స్ కొత్త బ్లాక్ ప్రారంభం అయిన తర్వా రాష్ట్రంలో మొత్తం బెడ్ల సంఖ్య 50 వేలకు చేరుకుంటుందని అన్నారు. ఒకప్పుడు ఆక్సిజన్ కావాలంటే చాలా ఇబ్బందులు పడే వాళ్లము. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న అన్ని బెడ్లు ఆక్సిజన్ బెడ్లే అని చెప్పారు. ఇక 10 వేల సుపర్ స్పెషాలిటీ బెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్ల వల్ల ఎంతో లాభం చేకూరిందని అన్నారు. కేసీఆర్ కిట్లు అంటే నాలుగు సబ్బులు మూడు వస్తువుల కాదని.. పేద మహిళలకు అందించే గొప్ప ప్రయోజనం అని అన్నారు. ధనికులు మాత్రమే తీసుకునే బలవర్దకమైన ఆహారాన్ని న్యూట్రిషన్ కిట్ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. దీని వల్లే ఇవ్వాళ రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కూడా పెరిగాయని అన్నారు. ఈ రోజు కొత్త కాలేజీల్లో చేరి చదవును ప్రారంభిస్తున్న విద్యార్థులందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.


First Published:  15 Sept 2023 1:01 PM IST
Next Story