Telugu Global
Telangana

రూ.2,41,275 కోట్లకు తెలంగాణ ఐటీ ఎగుమతులు.. ఐటీ ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్

గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసినా.. ఈ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని కేటీఆర్ అన్నారు.

రూ.2,41,275 కోట్లకు తెలంగాణ ఐటీ ఎగుమతులు.. ఐటీ ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్
X

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో తెలంగాణ, హైదరాబాద్ వేగంగా దూసుకొని పోతున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 9 ఏళ్లలో తెలంగాణ ఐటీ రంగం ఎంతో పురోగతి సాధించిందని.. నేడు రాష్ట్ర ఐటీ ఉత్పత్తులు రూ.2,41,275 కోట్లకు చేరుకున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ-హబ్‌లో తెలంగాణ ఐటీ శాఖ 9వ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణను ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పినప్పుడు అనేక మంది ఆశ్చర్యంగా చూశారు. దేశ ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు అనేక ప్రయత్నాలు చేశాము. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసినా.. ఈ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఐటీ రంగానికి ఎంతో ఊతం ఇస్తుందని భావించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్ర రద్దు చేసినా.. ఈ రంగంలో భారీ ప్రగతిని సాధ్యం చేశామని అన్నారు. రెండో సంవత్సరాల కరోనా సంక్షోభాన్ని కూడా తట్టుకొని ఈ అభివృద్ధిని సాధ్యం చేశామన్నారు. కొన్నేళ్లుగా హైదరాబాద్ ఐటీ రంగ వృద్ధి అన్ని సూచీల్లో జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు వెళ్తోంది. హైదరాబాద్ నగరాన్ని ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షనీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఇదీ తెలంగాణ ఐటీ ప్రగతి..

తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.2,41,275 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయని చెప్పారు. గతేడాది రూ.1,83,569 కోట్ల ఎగుమతులు చేయగా.. ఈ సారి 31.44 శాతం వృద్ధితో అదనంగా రూ.57,706 కోట్ల ఎగుమతులు సాధ్యమయ్యాయని చెప్పారు. గతేడాది దేశవ్యాప్తంగా 2,90,000 కొత్త ఐటీ ఉద్యోగాలు రాగా.. కేవలం తెలంగాణలోనే 1,26,894 ఐటీ ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. దేశంలో వస్తున్న ప్రతీ రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే వస్తోందని అన్నారు.

రాష్ట్రం ఏర్పడిన 2014లో ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగిందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో 17.31 శాతం CAGR తో పెరిగింది. 2014లో 3,23,396 ఉద్యోగాలు ఉంటే అవి ఈ రోజు మూడు రెట్లు పెరిగి 9,05,715 చేరుకున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి దాకా ఐటీ రంగంలో నేరుగా 5,82,319 ఉద్యోగాలు వచ్చాయి. వీటికి తోడు మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చాయన్నారు. గతేడాది దేశ సగటు ఐటి ఎగుమతులు 9.36 శాతం ఉంటే తెలంగాణ మాత్రం అత్యంత అద్భుతంగా 31.44 శాతం మేర పెరిగాయని చెప్పారు.

2014లో మొత్తం దేశ ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83%గా ఉంటే నేడు కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ 27.6%గా ఉంది. దేశంలో కొత్త ఐటీ ఉద్యోగాల కల్పనలో గత సంవత్సరం 33% ఉద్యోగాలు తెలంగాణ నుంచి వస్తే.. అయితే అవి ఈ సంవత్సరం 44 శాతానికి పెరిగాయని చెప్పారు.

తెలంగాణకు వచ్చిన కీలక పెట్టుబడులు..

2022-23లో తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో కీలక పెట్టుబడులు సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి చెప్పారు. ఆ వివరాలు..

- ఫిస్కర్ సంస్థ తమ ఇండియా హెడ్ క్వార్టర్స్‌ని హైదరాబాదులో ఏర్పాటు చేయనున్నది.

- కాల్‌వే గోల్ఫ్ కంపెనీ 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో 200కు పైగా ఉద్యోగులతో కార్యాలయాన్ని ప్రారంభించింది.

- క్వాల్‌కామ్ సంస్థ.. అమెరికా తర్వాత తన అతిపెద్ద క్యాంపస్‌ని హైదరాబాదులో ఏర్పాటు చేస్తూ.. రూ.3,904 కోట్ల పెట్టుబడి పెట్టింది. 10 వేల మంది ఉద్యోగులతో కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది.

- గూగుల్ సంస్థ అమెరికా అవతల తన అతిపెద్ద కార్యాలయాన్ని 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించింది.

- స్విస్‌రే కంపెనీ హైదరాబాదులో తన ఇన్నోవేషన్, అనలిటికల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది

- జెడ్ఎఫ్ మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 5వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ హబ్‌ను ఏర్పాటు చేసింది.

- ఎక్స్‌పీరియన్ సర్వీసెస్ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. రానున్న మూడేళ్లలో 4వేల ఉద్యోగులను నియమించుకోనున్నది.

- ఎల్‌టీఐ మైండ్ ట్రీ సంస్థ హైదరాబాద్‌లో డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.

- తెలంగాణ పోలీస్ శాఖ సైబర్ క్రైమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది.

- జర్మనీకి చెందిన బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ 3000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది.

- మైక్రోసాఫ్ట్ మూడు కొత్త డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అతి పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే.

- అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ.3,300 కోట్లతో మూడు డేటా సెంటర్‌లను ఏర్పాటు చేసింది.

- సైబర్ ఆర్క్ కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పింది.

- లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

- డాజ్న్ సంస్థ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని ప్రకటించింది. ఇక్కడ 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ 1200 మందితో హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది.

- జ్యాప్ కామ్ గ్రూప్ 1000 మందికి పైగా ఉద్యోగులతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నది.

- టెక్‌నిప్ఎఫ్ఎంసీ గ్లోబల్ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్, ప్రొసీషన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నది. 2,500 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించనున్నాయి.

- హైదరాబాద్‌లో ఆలియంట్ గ్రూప్ విస్తరణకు ఏర్పాట్లు చేస్తోంది. మరో 9000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

- వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ తన కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని హైదరాబాదులో ఏర్పాటు చేయనుంది. దీని వల్ల 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

- మోండీ హోల్డింగ్స్ సంస్థ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

- రైట్ సాఫ్ట్‌వేర్ తమ నూతన డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. 500కు పైగా ఉద్యోగాలు రానున్నాయి.

- స్టేట్ స్ట్రీట్ తన అతి పెద్ద క్యాంపస్‌ని హైదరాబాదులో ఏర్పాటు చేసింది. ఇక్కడ 5వేల మందకి పైగా ఉద్యోగాలు లభించాయి.

టైర్-2 పట్టణాలకు ఐటీ..

ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా తెలంగాణలోని టైర్-2, టైర్-4 పట్టణాలకు కూడా విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నది. ఇప్పటికే వరంగల్‌లో టెక్ మహీంద్ర, సైయంట్, జెన్‌ప్యాక్ట్ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఎల్‌టీఐ మైండ్ ట్రీ, జెన్‌ప్యాక్ట్, హెచ్ఆర్‌హెచ్ నెక్ట్స్, హెగ్జాండ్ సొల్యూషన్ సంస్థలు ఈ ఏడాది నుంచి హన్మకొండలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నాయి. మహబూబ్‌నగర్ ఐటీ టవర్‌ను మే 6న ప్రారంభించారు. దీంతో పాటు ఇటీవల అమెరికా పర్యటనలో పలు కంపెనీలతో నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండలో ఐటీ ఉద్యోగాల కల్పనకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా ప్రాంతాల్లో 2,500 ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. బెల్లంపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు వాషింగ్టన్ సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.


ఎలక్ట్రానిక్స్ రంగంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు

కేవలం ఐటీ, ఐటీఈఎస్‌లోనే కాకుండా ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. దీని వల్ల ఈ రంగంలో 31,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. రూ.9,500 కోట్లతో అమరరాజా లిథియం అయాన్ తయారీ కేంద్రాన్ని దివిటిపల్లిలో ప్రారంభించనున్నది. ఈ కంపెనీ ప్రారంభమైతే 4,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.

500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్ సంస్థ భారీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కొంగరకలాన్‌లో ప్రారంభించనున్నది. అక్కడ దశలవారీగా 1 లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రిక్స్, ఈవీ వీక్‌ను కూడా నిర్వహించాము. ప్రపంచంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఈ రేసు జరిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీ హబ్-2ను కూడా ప్రారంభించాము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం. ఇక్కడ రెండు వేల స్టార్ట్ అప్స్ పని చేసేందుకు అవకాశం ఉన్నదని మంత్రి చెప్పారు. టీ-వర్క్ ప్రారంభించడం ద్వారా దేశలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రానికి హైదరాబాద్ హబ్‌గా మారిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.


First Published:  5 Jun 2023 11:10 AM GMT
Next Story