Telugu Global
Telangana

చంద్రబాబు అరెస్టు సక్రమమే.. – హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ

హైదరాబాద్‌లో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కట్టింది, తెచ్చింది.. వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు తెలిపారు.

చంద్రబాబు అరెస్టు సక్రమమే.. – హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
X

చంద్రబాబు అరెస్టు సక్రమమేనని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం వారు కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి భారీ సంఖ్యలో కార్లతో ర్యాలీ నిర్వహించారు. అవినీతికి పాల్పడకపోతే చంద్రబాబుకు అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు.

రెండు రోజుల క్రితం చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో పలువురు ఐటీ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం.. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బతిమాలుకుంటే చేశారని ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు తెలిపారు. ప్లీజ్‌ ప్లీజ్‌.. అంటూ బతిమాలుకుని.. దండం పెడతానని రిక్వెస్ట్‌ చేస్తే వారు ఆ కార్యక్రమం చేశారని వివరించారు.

హైదరాబాద్‌లో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కట్టింది, తెచ్చింది.. వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వచ్చింది వైఎస్సార్, కేసీఆర్‌ హయాంలోనే అని వివరించారు. చంద్రబాబు కట్టింది హైటెక్‌ సిటీ కమాన్‌ ఒక్కటేనని వారు తెలిపారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో స్కామ్‌ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టే న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్‌ విధించిందని ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు వివరించారు. రానున్న కాలంలోనూ చంద్రబాబు జైల్లోనే ఉంటారని, ఎవరెన్ని చెప్పినా సీఎం వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు తేల్చి చెప్పారు.


First Published:  17 Sept 2023 5:02 PM IST
Next Story