Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం లాంఛనమేనా? డీకే శివకుమార్‌తో కలిసి ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ షర్మిల!

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడానికి మరో రెండు నెలలే సమయం ఉండటంతో వైఎస్ షర్మిల మరోసారి విలీన ప్రక్రియపై చర్చలు జరుపుతున్నారు.

కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం లాంఛనమేనా? డీకే శివకుమార్‌తో కలిసి ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ షర్మిల!
X

కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్టీపీ విలీనంపై పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక చర్చలు జరిపారు. రెండు సార్లు కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ దగ్గరకు వెళ్లి వీలినానికి సంబంధించిన ప్రక్రియపై చర్చలు జరిపారు. అప్పట్లోనే షర్మిల పార్టీ విలీనం ఇక లాంఛనమే అని అందరూ భావించారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెట్టిన పేచీతో విలీన ప్రక్రియ తాత్కాలికంగా అక్కడికి ఆగిపోయింది.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడానికి మరో రెండు నెలలే సమయం ఉండటంతో వైఎస్ షర్మిల మరోసారి విలీన ప్రక్రియపై చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ సారి తాడో పేడో తేల్చుకోవాలని.. ఈ విషయాన్ని మరింతగా నాన్చడం తనకే మైనస్‌గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో తదుపరి చర్చల కోసం డీకే శివకుమార్‌ను కలవడానికి బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాలను ప్రియాంకా గాంధీ తరపున డీకే శివకుమార్ అనధికారికంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన విషయాలను ఆయన ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తున్నారు.

గాంధీల కుటుంబానికి సన్నిహితుడైన శివకుమార్ ద్వారానే ఈ విలీన ప్రక్రియ జరగాలని వైఎస్ షర్మిల కూడా భావిస్తున్నారు. వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.. ఆయన కేవలం షర్మిలకు సలహాలు ఇవ్వడం వరకే సరిపెడుతున్నారు. ఆయన సూచన మేరకే డీకేను ముందు పెట్టి విలీన ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తున్నది. అందుకే తాజాగా బెంగళూరులో తుది చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలతో కూడా డీకే శివకుమార్ మాట్లాడుతున్నట్లు తెలుస్తున్నది. విలీనం వల్ల కలిగే లాభనష్టాలను కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తెలంగాణ నుంచి రాజకీయాలు చేయాలా? లేదంటే ఏపీని రాజకీయ క్షేత్రంగా మార్చుకోవాలా అనే విషయాలపై అభిప్రాయాలు అడిగినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మరోసారి అభిప్రాయం అడిగినట్లు సమాచారం.

బెంగళూరులో చర్చల అనంతరం.. శివకుమార్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినాయకత్వంతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కనుక సఫలం అయితే.. రెండు మూడు రోజుల్లోనే షర్మిల పార్టీకి సంబంధించిన విలీన ప్రకటన బయటకు వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణ నేతల అభిప్రాయాలు, వైఎస్ షర్మిల డిమాండ్లను అధిష్టానం ముందు పెట్టే బాధ్యతను డీకే శివకుమార్ భుజానికి ఎత్తుకున్నారు. అన్నీ సానుకూలంగా జరుగుతాయని.. త్వరలోనే పార్టీ విలీనం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

First Published:  8 Aug 2023 12:21 PM GMT
Next Story