విద్యార్థులు, టీచర్ల ముందు కేసీఆర్ ను విమర్శించడమే మీ విధానమా?
సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యార్థుల, టీచర్ల ముందు కేసీఆర్ ను విమర్శించడమే మీ విధానమా అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. గత పది నెలల్లో కేసీఆర్ పేరు ఎత్తకుండా ఒక్క సభలోనైనా సీఎం మాట్లాడారా అని ప్రశ్నించారు. మాట్లాడేప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా అనేది సీఎం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఎన్నికలకు ముందు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. 11 వేల పోస్టులే భర్తీ చేశామన్న మాట కూడా నిన్నటి సభలో చెప్తే బాగుండేదన్నారు. కేసీఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో 3,202 పోస్టులు, యూనివర్సిటీల్లో 1,081 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారని, 3,896 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేశారని.. సభలో రేవంత్ ఆ విషయాలు చెప్తే బాగుండేదని అన్నారు. మన ఊరు - మన బడి ఎందుకు ఆపారో, 6 వేల స్కూళ్లు మూత పడ్డాయని రేవంత్ ప్రచారం చేశారని.. నిన్నటి సభలో ఆ లిస్ట్ విడుదల చేస్తే బాగుండేదన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆ వ్యవస్థను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తోందన్న మాట కూడా చెప్తే బాగుండేదరన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిందని.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో మిగతా అన్ని స్కూల్స్ గాలికి వదిలేస్తున్నామని చెప్తే కూడా బాగుండేదని ఎద్దేవా చేశారు.