దేశంలో టీఆర్‌ఎస్ బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించబోతోందా ?
ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల కోసం డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ నిరంకుశ పాలన, ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్.... ఈ నేపథ్యంలో టీఆరెస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
ప్రస్తుతం దేశంలో బీజేపీకి ఎదురులేనట్టు కనిపిస్తోంది. సామ, ధాన, బేధ, దండోపాయాలతో బీజేపీ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటూ వెళ్తోంది. విపక్షాలను బలహీనపర్చడం, ఈడీ, సీబీఐ ల ద్వారా ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి బలవంతంగా లాక్కోవడం. బలం లేని చోట్ల కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం....మరో వైపు 100 ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఉనికి నిలబెట్టుకోవడమే కష్టంగా మారిపోవడం... ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ దేశంలో ఇక బీజేపీకి ఎదురు లేదని, ఆ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదని అనిపించడంలో తప్పులేదు. కానీ చరిత్ర చూస్తే ఇంత కన్నా బలమైన పార్టీలు, ఇంత కన్నా నిరంకుశమైన శక్తులు చిత్తుగా ఓటమి పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఒకప్పుడు తిరుగులేని నాయకురాలు ఇందిరా గాంధీ 1977 ఎన్నికలలో కాంగ్రెస్ కు అత్యంత బలమైన రాయ్ బరేలీలో తన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. ప్రభుత్వమే కూలి పోయి ఎవరూ ఊహించని విధంగా జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరా గాంధీ వంటి బలమైన నాయకురాలు ఓడిపోతుందని ఎవరైనా ఊహించారా ? సరైన ప్రత్యామ్నాయం ఉంటే ప్రజలు ఎంత పెద్ద వాళ్ళనైనా ఓడిస్తారని రుజువు చేస్తూనే ఉన్నారు.
ఒక సారి చరిత్ర గమనిస్తే...1977 ఎన్నికలలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని జనతాపార్టీ 'ఓటమిలేని' కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది. 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో 13 రాజకీయ పార్టీల యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది.
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బకొట్టారు ఎన్‌టి రామారావు.
ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా పోరాడేందుకు అప్పటి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీని స్థాపించినప్పుడు చాలా మంది దానిని మరో రాజకీయ పార్టీగా కొట్టిపారేశారు. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతుందని చాలామంది నమ్మలేదు. కానీ రాష్ట్రం సాధించడమే కాక టీఆరెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.
తమిళనాడులో MG రామచంద్రన్ ఏఐఏడీఎంకే పార్టీని ఏర్పాటు చేసి ఎంతో చరిత్ర ఉన్న DMKని ఓడించారు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలను మట్టికరిపించిన మమతా బెనర్జీ, పంజాబ్‌లో శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని ఓడించిన అరవింద్ కేజ్రీవాల్ ...ఇలా అనేక ఉదాహరణలున్నాయి.
ఇప్పుడు అలాంటి ప్రత్యామ్నాయ శక్తి అవసరమా అనే ప్రశ్న వస్తుంది. పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం స్థాయిలు, అసమానత, ద్రవ్యోల్బణం, అవినీతి, వివక్ష, మత విద్వేషాలతో పాటు, కేంద్ర సంస్థలైన ED, CBI, IT వంటి వాటిని బిజెపి దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడం, కాంగ్రెస్ తన పాత్రను సూత్రప్రాయంగా పోషించలేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీల అవసరం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీని ప్రారంభించనున్నారు., జాతీయ స్థాయిలో విపక్షాలు ఏకమవుతున్నాయి. ఏదో ఒక పార్టీని ఏర్పాటు చేయడంకాదు. ప్రత్యామ్నాయ విధానాలను ప్రకటిస్తున్నారు కేసీఆర్. కేంద్రంలో రైతు ప్రభుత్వమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారాయన. దేశం మొత్తం రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇస్తున్నారు కేసీఆర్.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేవలం బీజేపీ లేదా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే సరిపోదు. ప్రజలకు ఖచ్చితమైన ప్రత్యామ్నాయ కార్యక్రమాలు అవసరం, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) తెలంగాణలో ఇటువంటి కార్యక్రమాలతో తన సత్తాను నిరూపించుకుంది. ఈ పథకాల్లో కొన్నింటిని కేంద్రం ఇప్పటికే అనుకరిస్తోంది – రైతు బంధు, మిషన్ భగీరథ తదితర పథకాలు టీఆర్‌ఎస్ ను ఖచ్చితంగా జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెడుతాయి.
ఇప్పటికే మెజారిటీ రాష్ట్రాల ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. BJP , కాంగ్రెస్ రెండింటి ఓట్లు/సీట్ల వాటా వేగంగా క్షీణిస్తోంది. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌లో కూడా సమాజ్‌వాదీ పార్టీ చాలా సీట్లను సాధించింది. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలన్నీ ఇప్పుడు కలసికట్టుగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించాయి. .
'బీజేపీ ముక్త్ భారత్'కు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో నాయకులతో చర్చలు జరపడమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న రైతు నాయకులను తెలంగాణ రప్పించి తెలంగాణలో రైతుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూయించారు. రైతులు కూడా ఇక్కడి కార్యక్రమాలను చూసి ప్రశంసలు గుప్పించడమే కాదు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారు.
ఈ నేపథ్యంలో జాతీయ వేదికపై ప్రత్యామ్నాయం రావడానికి ఇదే సరైన సమయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించబోయే జాతీయ పార్టీ అనేక సమస్యలకు, అనేక ప్రశ్నలకు సమాధానంగా మారుతుందని భావిస్తున్నారు.