ఇదేనా సోకాల్డ్ ప్రజా పాలన.. రేవంత్ సర్కార్‌కు హరీష్ వార్నింగ్
ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు పరిష్కరించే దాకా, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు పలు డిమాండ్లతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోకాల్డ్ ప్రజాపాలనలో నిరుద్యోగులకు శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా.. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం లేదా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు.
హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా
— Harish Rao Thanneeru (@BRSHarish) July 5, 2024
టిజిపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.… pic.twitter.com/hVqe9yXup3
ఒకవైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ సర్కార్ మరోవైపు నిరుద్యోగుల గొంతులను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతోందన్నారు హరీష్ రావు. ఇది ప్రజా పాలన కాదు అప్రజాస్వామ్య పాలన అంటూ పైర్ అయ్యారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకుని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు పరిష్కరించే దాకా, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నిరుద్యోగుల తరపున గొంతెత్తుతామన్నారు. అరెస్టులు, నిర్బంధాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు గ్రూప్-1 మెయిన్స్ 1:100 పరిగణించాలని, గ్రూప్ - 2, గ్రూప్ - 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ సరైన సమాధానం రాకపోవడంతో TGPSC ముట్టడికి పిలుపునిచ్చారు నిరుద్యోగులు. దీంతో నిరుద్యోగులను, విద్యార్థి సంఘాలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. TGPSC ముందు బారికేడ్లతో పాటు ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి భారీ భద్రత ఏర్పాటు చేశారు.