జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనుక.. మరో వ్యూహం ఉందా?
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, తన భార్య నిర్మలకు కానీ సీటు ఇస్తే గెలిపిస్తానని అన్నారు. జగ్గారెడ్డి సడన్‌గా ఈ వ్యాఖ్యలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం దాని వెనుక వేరే వ్యూహం ఉందని చెబుతున్నారు.
కాంగ్రెస్ నేతల మాటలు, చేతల వెనుక చాలా అర్థాలుంటాయి. పైకి ఓ మాట అనేసి వెళ్లిపోయినా.. దాని వెనుక వారి భవిష్యత్ వ్యూహం తప్పకుండా అర్థం అవుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మొదటి నుంచి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు టీపీసీసీ చీఫ్ పదవి రాకుండా అనేక ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పదవి నుంచి తప్పించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఇదంతా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పదవి ఇప్పించాలనే తపనే ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చివరికి అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఏకంగా పార్టీ మారిపోయారు. ఇప్పుడు జగ్గారెడ్డి వంతు వచ్చింది.
కోమటిరెడ్డి బ్రదర్స్ కంటే ముందు నుంచే రేవంత్ రెడ్డిపై విరుచుకుపడింది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డే. మొదటి నుంచి రేవంత్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియా ముందు మాట్లాడేవారు. ఒకానొక సందర్భంలో తాను పార్టీకి రాజీనామా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల రేవంత్‌పై విమర్శలు తగ్గించారు. కానీ మరో రూట్లో తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, తన భార్య నిర్మలకు కానీ సీటు ఇస్తే గెలిపిస్తానని అన్నారు. జగ్గారెడ్డి సడన్‌గా ఈ వ్యాఖ్యలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం దాని వెనుక వేరే వ్యూహం ఉందని చెబుతున్నారు.
జగ్గారెడ్డి ఈసారి రెండు టికెట్లు ఆశిస్తున్నారు. సంగారెడ్డి అసెంబ్లీతో పాటు మెదక్ లోక్‌సభ సీటును తన కుటుంబానికి కేటాయించేలా పావులు కదుపుతున్నారు. 2018 ఎన్నికల్లో ఒకే కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కుటుంబాల విషయంలో ఈ నిబంధనను పక్కన పెట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి, ఆయన భార్య కోదాడ నుంచి పోటీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినా.. ఆ తర్వాత రాజీనామా చేసి నల్గొండ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడు నుంచి గెలిచారు. ఈసారి అదే విధంగా తన కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుకుంటున్నట్లు సమాచారం.
తనకు అసెంబ్లీ సీటు అడిగి, భార్యకు మెదక్ పార్లమెంటు సీటు కోరితే అధిష్టానం ఇవ్వదని ఆయన అంచనాకు వచ్చారు. అందుకే భార్యను సంగారెడ్డి నుంచి పోటీ చేయించి.. తాను మెదక్ పార్లమెంటు బరిలో దిగాలని భావిస్తున్నారు. జగ్గారెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాలో మంచి పట్టుంది. కాబట్టి తను కోరినట్లే సీట్లు కేటాయిస్తారని ఆయన అంచనా వేస్తున్నారు. అందుకే తాను అసెంబ్లీ బరిలో ఉండనని ముందుగానే ప్రకటించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎలాగో తెలంగాణ అసెంబ్లీకి ముందే ఎన్నికలు వస్తాయి. కాబట్టి గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేయడానికి కూడా చాలా టైం ఉంటుందని జగ్గారెడ్డి అనుకుంటున్నారు. భార్యను సంగారెడ్డి నుంచి గెలిపించుకొని.. ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి తాను పోటీ చేయాలని అనుకుంటున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' జగ్గారెడ్డి నియోజకవర్గం మీదుగా వెళ్తుండటం ఆయనకు బాగా కలిసి వచ్చే అంశం. ఎలాగో రాహుల్‌తో పాటు నడిచే అవకాశం ఉంది. అదే సమయంలో తన మనసులో మాట చెప్తారని సన్నిహితులు అంటున్నారు. అయితే జగ్గారెడ్డి అంటే పడని రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బలమైన నేతను పోగొట్టుకోవడం రేవంత్‌కు కూడా ఇష్టం ఉండదు. అందుకే జగ్గారెడ్డి ఇలా స్కెచ్ వేశారని చర్చ జరుగుతోంది.